బీజేపీ నాపై కుట్ర చేస్తోంది.. హైకోర్టులో పిటిషన్ వేస్తా : పైలెట్ రోహిత్ రెడ్డి
రోహిత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడి తన వివరణను ఇచ్చారు.
బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మధ్యవర్తులతో జరిగిన సంభాషణలో అసలు మనీ అనే మ్యాటరే రాలేదని.. కావాలనే బీజేపీ కక్షతో నాపై అభాండాలు మోపుతున్నదని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ఏజెంట్లు ప్రయత్నించినప్పుడు తాను అసలు మనీ మ్యాటర్ మాట్లాడలేదని.. వాళ్ల బండారం బయటపెడదామనే సంభాషణను కొనసాగించానని రోహిత్ చెప్పారు. కానీ దీన్ని మనసులో పెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై కక్షగట్టి ఈడీ, సీబీఐలను మీదకు పంపించిందని ఆరోపించారు.
రోహిత్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడి తన వివరణను ఇచ్చారు. ఈడీ ముందుగా తనను విచారణకు పిలిచినా.. అసలు కేసేంటో చెప్పలేదని రోహిత్ అన్నారు. రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు కేసని తనకు వివరించినట్లు ఆయన వెల్లడించారు. విచారణలో కూడా కేవలం బయోడేటా, వ్యక్తిగత వివరాలతో పాటు వ్యాపార లావాదేవీలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తీసుకున్నారని రోహిత్ తెలిపారు.
ఈ కేసులో అసలు మనీ వ్యవహారమే లేదని.. కేవలం బీజేపీ కుట్రను బయట పెట్టినందుకే తనపై ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారని రోహిత్ చెప్పారు. ఈడీ విచారణకు సంబంధించిన నోటీసులపై ఛాలెంజ్ చేస్తూ తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు రోహిత్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో దోషులను, అనుమానితులను పిలవకుండా బాధితుడిని అయిన నన్ను పిలిచి మొదటిగా విచారణ చేశారని రోహిత్ చెప్పారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే తనపై చేస్తున్న కుట్ర అని రోహిత్ అన్నారు.
నన్ను, నా కుటుంబాన్ని బీజేపీ బెదిరించే ప్రయత్నాలు చేసిందని.. కానీ వారి పప్పులు ఉడకలేదని రోహిత్ రెడ్డి చెప్పారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఆరోజు బీజేపీ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లుగానే, నేడు మరోసారి వారి ప్రయత్నాలను తిప్పి కొడతామన్నారు. నందకుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ల తారుమారు చేసి, తనను ఈ కేసులో ఎలాగైనా సరే ఇరికించే కుట్ర జరగుతోందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు.