మల్కాజ్‌గిరి BRS ఎంపీ అభ్యర్థిగా భద్రారెడ్డి..!
ఎన్నికల ఖర్చు ఎంతైనా భరించుకోగల సత్తా మల్లారెడ్డికి ఉంది. ఇక నియోజకవర్గంలో పరిచయాలు సైతం ఆయనకు కలిసొచ్చే అంశం.
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం.. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఆయన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్‌గిరి సీటు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవల మల్లారెడ్డి సైతం తన కుమారుడికి మల్కాజ్‌గిరి ఎంపీ సీటు అడుగుతున్నానని ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు.
బీఆర్ఎస్ హైకమాండ్ సైతం భద్రారెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ పరిధిలోనే మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్, ఆయన అల్లుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. గతంలో మల్కాజ్‌గిరి నుంచి మల్లారెడ్డి ఎంపీగా కూడా గెలిచారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి.
ఎన్నికల ఖర్చు ఎంతైనా భరించుకోగల సత్తా మల్లారెడ్డికి ఉంది. ఇక నియోజకవర్గంలో పరిచయాలు సైతం ఆయనకు కలిసొచ్చే అంశం. 2019లో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయన కొడుకు బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఇదే తనకు లాస్ట్ టర్మ్ అని మల్లారెడ్డి ప్రకటించారు. దీంతో కొడుకును రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఇదే సరైన సమయంగా ఆయన భావిస్తున్నారు.