రాజాసింగ్ విద్వేష వీడియో.. వెల్లువెత్తిన ఆందోళనలు..

ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా రాజాసింగ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.

Advertisement
Update:2022-08-23 08:15 IST

హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టారు మైనార్టీ నాయకులు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లలో మూకుమ్మడిగా ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. భవనీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్, మీర్ చౌక్, చార్మినార్ పోలీస్ స్టేషన్ల లో రాజాసింగ్‌పై పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు యువకులు. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

విద్వేష వీడియో..

ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా రాజాసింగ్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ విషయంపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. సోమవారం రాత్రికి యువకులంతా రాజాసింగ్‌కి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. జాతీయ జెండాలు చేతబట్టుకుని పోలీస్ స్టేషన్ల దగ్గరకు వచ్చారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని, తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న వీడియోని డిలీట్ చేయించాలని డిమాండ్ చేశారు.

డబీర్ పురాలో పోలీస్ పహారా..

పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. డీసీపీ సాయి చైతన్య, మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల డబీర్ పురాలో పర్యటించారు. యువతకు సర్దిచెప్పి ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో రాజా సింగ్ పై కేసులు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News