యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిచేలా చేస్తామని మంత్రులు తెలిపారు. ప్రజలు సహకారం, ఆశీస్సులతో ప్రస్తుతం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టుతామని వారు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దయ వల్ల వర్షాలు బాగా కురిసాయని, పంటలు సుభిక్షంగా పండుతున్నాయన్నారు. తెలంగాణ రైతాంగం మొత్తం ప్రభుత్వం కల్పించే వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యాదగిరిగుట్ట ఆలయ అంకురార్పణలో గత ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామిగా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. తెలంగాణకే కాకుండా లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు భారతదేశం మొత్తానికి ఉండాలని ఆయన కోరుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.అనంతరం మంత్రులు ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని కలియ తిరిగి చూశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు మంత్రులకు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసి, శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకుంటారని యాదాద్రి కలెక్టర్ తెలిపారు.