మాట నిలబెట్టుకుంటాం.. మునుగోడులో అభివృద్ధి సమీక్ష

మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కూసుకుంట్లకు సూచించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ సూచనలతో తాజాగా మునుగోడులో అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష చేపట్టారు.

Advertisement
Update:2022-12-01 12:16 IST

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ భారీగా హామీలిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపించలేదని, టీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అభివృద్ధి కార్యక్రమాల్లో పురోగతి సాధించి, వచ్చే ఎన్నికలనాటికి నియోజకవర్గం రూపు రేఖలు మార్చేస్తామని తెలిపారు మంత్రులు. మంత్రి కేటీఆర్ మునుగోడుని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోడానికి ఈరోజు మునుగోడులో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

మోడల్ నియోజకవర్గంగా మునుగోడు అభివృద్ధి..

మునుగోడుని అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని, అదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీఎం కేసీఆర్ ని కలసి కృతజ్ఞతలు తెలిపే క్రమంలో కూడా అభివృద్ధిపైనే చర్చ జరిగింది. మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కూసుకుంట్లకు సూచించారు సీఎం కేసీఆర్. ఆయన సూచనలతో తాజాగా మునుగోడులో అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష చేపట్టారు.

మునుగోడుని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షలో పాల్గొన్నారు. అభివృద్ధి పథకాలను సమీక్షిస్తూనే శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు కీలక సూచనలిచ్చారు. స్థానిక సంస్థల్లో పాలన, ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ సమస్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలు ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు.


Tags:    
Advertisement

Similar News