డెంగ్యూపై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. జ్వర సర్వేకు రంగం సిద్ధం

జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో యుద్ద ప్రాతిపదికన 'జ్వర సర్వే' నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కలిసి ఆయా శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Advertisement
Update:2022-09-06 07:07 IST

హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు కలిసి డెంగ్యూ నివారణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో యుద్ద ప్రాతిపదికన 'జ్వర సర్వే' నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ కలిసి ఆయా శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతీ ఐదేళ్లకు సాధారణంగా డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. ఐదేళ్ల క్రితం డెంగ్యూ కేసులు భారీగా పెరిగిన తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఐదో ఏడు కాబట్టి హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలు రిపోర్టుల ద్వారా గమనించాము అని అన్నారు మంత్రులు. కాబట్టి వైద్యారోగ్య శాఖతో కలసి పురపాలక, పంచాయితీ రాజ్ శాఖలు పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

ఈ ఏడాది జూలై నెలలో 542 కేసులు నమోదైతే.. ఆగస్టులో 1827కు చేరుకున్నాయి. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత మనకు ఉన్నదని హరీశ్ రావు అన్నారు. మంచి నీటి దోమల వల్లే డెంగ్యూ ప్రబలుతుంది. సాధారణంగా ఇవి నీటి తొట్టెలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లలో నిలిచిన నీటిలో పెరుగుతాయి. పగటి పూటే ఎక్కువగా కుడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్ సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 1600 మంది ఎటమాలజీ స్టాఫ్ బాగా పని చేస్తున్నారు. వీరితో పాటు వైద్యారోగ్య సిబ్బంది కూడా ప్రతీ రోజు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి. ప్రజా ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.

ఇటీవల సాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 10వేల యూనిట్ల రక్తాన్ని సేకరించామని, ఇప్పటికే ప్లేట్‌లెట్స్ సెపరేటర్ మెషీన్లను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎవరికీ ఎంత బ్లడ్ అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి చెప్పారు. ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, మందులు, ఎక్విప్‌మెంట్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నెల 17న హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి.. రక్తాన్ని సేకరించేలా చర్యలు తీసుకుంటున్నాము. దోమల నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి టీవీ, రేడియో మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు.

ప్రజలు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బస్తీ దవాఖానకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ఆరోగ్య కార్యకర్తలు ప్రోత్సహించాలని ఆయన కోరారు. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని వైద్య సిబ్బంది డోర్ టూ డోర్ 'జ్వర సర్వే' నిర్వహించాలని ఆయన ఆదేశిచారు. టీ-డయాగ్నసిస్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా, ఉచిత వైద్యం కూడా అందిస్తున్నాము కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. డెంగ్యూ కేసుల నిర్థారణకు ర్యాట్ కిట్స్‌ను ఇప్పటికే బస్తీ దవాఖానల్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు. గత నెలన్నరగా టీ-డయాగ్నసిస్ ద్వారా 27వేల టెస్టులు చేశామని.. అందులోనే కేసులు పెరిగినట్లు తెలిసిందని హరీశ్ రావు అన్నారు.

బస్తీ దవాఖానల వల్ల ఫివర్, గాంధీ ఆసుపత్రికి వచ్చే కేసులు తగ్గాయని చెప్పారు. ఈ రెండు ఆసుపత్రులతో పాటు ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రుల్లో బ్లడ్ సెపరేటర్స్ ఉన్నాయని.. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. వైద్యారోగ్య సిబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో 'జ్వర సర్వే' చేసే సమయంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ప్రతీ ఒక్కరికీ వేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం : మంత్రి కేటీఆర్

వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి హరీశ్ చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నానని కేటీఆర్ అన్నారు. గత మూడేళ్లుగా ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చాలా బాగా చేశాము. ఇకపై కూడా ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనర్లు ఏయే వార్డుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయో సర్వే చేసి ఓ నిర్థారణకు రావాలని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో డెంగ్యూ నివారణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.

జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల ప్రోగ్రాంలో చిన్న పిల్లలు, మహిళలను కూడా భాగస్వాములుగా చేర్చాలని.. అందుకు మెప్మా సహాయం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. స్కూల్ విద్యార్థులు, టీచర్లు అందరూ సామాజిక బాధ్యతగా పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలని.. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి ఇండ్లకు స్టిక్కర్లు అంటించాలని కేటీఆర్ చెప్పారు.

సాధారణంగా డెంగ్యూ కారక దోమలు మురుగు నీటిలో కాకుండా మంచి నీటిలో ఉంటాయి. వర్షం, ట్యాప్ నుంచి వచ్చే నీటిలో ఇవి పెరుగుతాయి. అందుకే ఇలాంటి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కేటీఆర్ కోరారు. విద్య, మున్సిపల్ శాఖలు ఈ కార్యక్రమంలో మెప్మా, విద్యార్థులు, పిల్లలు, ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఎటమాలజీ టీం బాగా పని చేస్తున్నారు, యాంటీ లార్వా ఆపరేషన్లు కూడా విస్తృతంగా చేపట్టారు. డెంగ్యూపై మరింత ఎక్కువగా ప్రచారం చేయాలని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెలబ్రిటీలను వినియోగించుకోవాలని, రేడియో, లోకల్ టీవీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించాలి. జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమం చేస్తే ప్రజల్లో మంచి చైతన్యం వస్తుందని కేటీఆర్ సూచించారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని కేటీఆర్ అన్నారు.

జ్వర సర్వేను చాలా పకడ్బందీగా నిర్వహించాలని కేటీఆర్ చెప్పారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఈ సర్వేను నిర్వహిద్దామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎటమాలజీ సిబ్బందితో పాటు వైద్యారోగ్య అధికారులు సమన్వయం చేసుకుంటూ సర్వేను నిర్వహించాలని అన్నారు. హెల్త్ అండ్ మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ జ్వర సర్వే ద్వారా వెళ్లి జ్వరం ఉందా? బూస్టర్ డోస్ వేసుకున్నారా అనే విషయాలు పరిశీలించాలని అన్నారు. హైదరాబాద్ సహా, డెంగ్యూ కేసులున్న పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కేటీఆర్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News