బావా మాస్ నువ్వు చూసుకో.. క్లాస్ నే చూస్తా
హరీష్‌రావు తనదైన శైలిలో పంచులతో కూడిన రాజకీయ ప్రసంగాలతో దూసుకెళుతుంటే.. కేటీఆర్ క్లాస్ పీపుల్‌ను ఆకట్టుకోవడానికి అన్ని మార్గాలనూ టచ్ చేస్తూ వెళుతున్నారు.
కేటీఆర్, హరీష్‌రావు.. బీఆర్ఎస్ జోడు గుర్రాలు.. అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారాన్నిహోరెత్తిస్తుంటే మరోపక్క కేటీఆర్, హరీష్‌రావు అన్ని వర్గాలనూ కలుస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా హరీష్‌రావు తనదైన శైలిలో పంచులతో కూడిన రాజకీయ ప్రసంగాలతో దూసుకెళుతుంటే.. కేటీఆర్ క్లాస్ పీపుల్‌ను ఆకట్టుకోవడానికి అన్ని మార్గాలనూ టచ్ చేస్తూ వెళుతున్నారు.
ప్రముఖులతో ఇంటర్వ్యూలు.. సంస్థలతో కేటీఆర్ భేటీలు
కేటీఆర్ తమ పార్టీ వాణిని వినిపించడానికి మేధావి వర్గంతో మమేకమవుతున్నారు. రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌తో ఇంటర్వ్యూ, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌తో ముఖాముఖిలో పాల్గొన్నారు. తమ పార్టీ స్టాండ్‌ను, తెలంగాణ అభివృద్ధికి తమ ప్రణాళికలను వివరించారు. బిల్డర్స్ అసోసియేషన్లు, కాలనీ సంఘాల నేతలో మమేకమై బీఆర్ఎస్‌కు క్లాస్ సర్కిల్‌లో మద్దతు కూడగడుతున్నారు. నిలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగినా, యూట్యూబ్ స్టార్ గంగవ్వతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొన్నా.. అన్నింట్లోనూ పార్టీకి ప్రచారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.
మాస్‌పల్స్ పట్టేస్తున్న హరీష్‌రావు
మరోవైపు మాస్‌లో తనకున్న క్రేజ్‌తో హరీష్‌రావు దూసుకెళుతున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రచార సభల్లో పాల్గొంటూ ప్రత్యర్థులపై వాగ్బాణాలతో రాజకీయ వేడి పెంచుతున్నారు. పలు సంఘాలతో మాటామంతీ కలుపుతున్నారు. మామ కేసీఆర్ నుంచి నేర్చుకున్నరాజకీయ మెలకువలు, తన వాగ్దాటితో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్‌లో అగ్రనేతలిద్దరూ తమదైన శైలిలో పార్టీకి ప్రచారానికి ఇరుసులా పని చేస్తున్నారు.