కేసీఆర్ యాత్రకు కాంగ్రెస్ కౌంటర్..

ప్రస్తుతం తెలంగాణలో కరువు పరిస్థితులు హాట్ టాపిక్ గా ఉన్నాయి. కేసీఆర్ పరామర్శ యాత్రపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందించారు.

Advertisement
Update:2024-04-01 07:17 IST

'ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు' అంటూ కేసీఆర్ చేసిన విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. కరువు పరిస్థితుల్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన పరిస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని అన్నారాయన. రాష్ట్రంలో ఏ ఒక్క రైతునీ నష్టపోనివ్వమని భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబరు 7న అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు మంత్రి తుమ్మల. అప్పటికే నాగార్జునసాగర్‌లో నీళ్లులేని కారణంగా మొదటి పంటకి కూడా నీరివ్వలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చాక రెండో పంటకు నీళ్లివ్వాలంటూ ప్రతిపక్షం హేతుబద్ధత లేని డిమాండ్ చేసిందని విమర్శించారు. రైతుబంధు పేరిట విత్తన సబ్సిడీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, డ్రిప్‌ స్ప్రింక్లర్ల మీద సబ్సిడీలన్నీ ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతుల్ని గత ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఏఒక్క రైతుని కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించారని, మొదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి సరిపెట్టారని చెప్పారు తుమ్మల.

కరువు.. కష్టాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోక పోవడం వల్ల కరువు పరిస్థితులు నెలకొన్నాయా..? లేక అది సహజ విపత్తా..? అనే విషయాలు పక్కనపెడితే.. ప్రస్తుతం తెలంగాణ రైతాంగం మాత్రం కాంగ్రెస్ పై కోపంతో ఉంది. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు రైతులు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల రైతు ఓదార్పు యాత్రలు చేస్తున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలెవరూ అన్నదాతలను పలకరించలేదు. ఓట్లకోసం తమ వద్దకు వచ్చినవారు, అధికారంలోకి వచ్చాక తమని ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలపై ఈ కరువు వ్యవహారం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News