పాలమూరుకి ఐటీ కళ.. స్థానికులకోసం జాబ్ మేళా
పాలమూరు బిడ్డలు కూలిపనులకు వెళ్లే స్థాయి నుంచి, ఐటీ ఉద్యోగాల వరకు నేడు ఎదిగారని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక్కడే చదివి, ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు.
పాలమూరు అంటే వలసల గడ్డ అనే పేరు ఒకప్పుడు ఉండేదని, నేడు ఉపాధికోసం పాలమూరుకే ఇతర ప్రాంతాలవారు వలస వచ్చే పరిస్థితి ఉందని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాలమూరు బిడ్డలు కూలిపనులకు వెళ్లే స్థాయి నుంచి, ఐటీ ఉద్యోగాల వరకు నేడు ఎదిగారని చెప్పారు. ఇక్కడే చదివి, ఇక్కడే ఉద్యోగం చేసే అవకాశాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. ఈ నెల 9వ తేదీన స్థానిక శిల్పారామంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉంటుందని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్ తో పాటు ఇతర ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా ఐటీ హబ్ లు ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ లో కూడా ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఇక్కడ తమ బ్రాంచ్ లను నడుపుతున్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగాలకోసం ఇప్పుడు జాబ్ మేళా పెడుతున్నారు. ఇందులో మహబూబ్ నగర్ యువతకు ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం 650 ఉద్యోగాలకోసం 10కంపెనీలు ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మేళాకు సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
త్వరలోనే అమర్ రాజా కంపెనీ కూడా మహబూబ్ నగర్ లో ప్రారంభమవుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హన్వాడలో ఫుడ్ పార్కు వస్తుందని, మెట్రో రైలు సౌకర్యం షాద్ నగర్ వరకు విస్తరిస్తోందని అన్నారు. మహబూబ్ నగర్ త్వరలోనే కార్పొరేషన్ అవుతుందని చెప్పిన ఆయన.. ఐటీ టవర్ నుంచి బై పాస్ కు 100 ఫీట్ల రోడ్ కూడా వస్తుందని చెప్పారు. అక్కడినుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి గంటలోపే చేరుకోవచ్చని అన్నారు. మహబూబ్ నగర్ భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.