అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. తెలంగాణ మంత్రి ప్రతిజ్ఞ
గిరిజనుల అభ్యున్నతికోసం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్ కి సంఘీభావంగా తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. అలాంటి మంచి సీఎం మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తాను పాదరక్షలు ధరించని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇది తాను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని, ఈ నిర్ణయానికి ముందు తాను ఎవర్నీ సంప్రదించలేదని చెప్పారు. ఎవరు వద్దన్నా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోనని, రాబోయేది ఎండాకాలం అయినా తాను చెప్పులు లేకుండానే తిరుగుతానని స్పష్టం చేశారామె. మళ్ళీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే తిరిగి కాళ్లకు చెప్పులు ధరిస్తానని పేర్కొన్నారు సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ పై ఉన్న అభిమానంతో తీసుకున్న నిర్ణయం ఇదని, పూర్తిగా తన వ్యక్తిగతమని వెల్లడించారు.
ఎందుకీ ప్రతిజ్ఞ..
ఇటీవల గిరిజనులకు 10శాతం అదనపు రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన స్టేజ్ పై ఉన్న సత్యవతి రాథోడ్.. ఆ సంతోష సమయంలో తాను చెప్పులు లేకుండా తిరుగుతానని ప్రతిజ్ఞ చేసినట్టు చెబుతున్నారు. గిరిజనుల అభ్యున్నతికోసం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్ కి సంఘీభావంగా తనకు తానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాంటి మంచి సీఎం మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు సత్యవతి రాథోడ్. గిరిజనులందరి పక్షాన గిరిజన బిడ్డగా మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు
సత్యవతి రాథోడ్ నిర్ణయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె చాలా పర్యటనలకు చెప్పులు లేకుండానే వెళ్లారు. అయితే ఎవరూ పెద్దగా గమనించలేదు. తాజాగా ఆమె చెప్పులు ధరించకపోవడాన్ని గమనించిన అనుచరులు కారణం అడగగా.. ఆమె ఇలా సమాధానం చెప్పారు. సీఎం కేసీఆర్ పై మంత్రి తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ఇలా చాటుకున్నారని, తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ నేతలు.