కామారెడ్డిలో బీజేపీ ఫ్లాప్ షో.. ఊహించని రీతిలో టీఆర్ఎస్ ఎదురుదాడి..

రేషన్ షాపు వద్ద నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-09-03 08:49 IST

కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన హడావిడి చివరకు ఫ్లాప్ షో గా మిగిలింది. స్థానిక అధికారులపై చిందులు తొక్కి, కేంద్ర పథకాలను ప్రచారం చేసుకోవాలనుకున్నారామె. భారత దేశం మొత్తాన్ని మోదీయే పోషిస్తున్నారని, మోదీ ఫొటో లేకుండా రేషన్ ఇవ్వడమేంటని మండిపడ్డారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలనుంచి ఎదురుదాడి మొదలవడంతో బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఇప్పటికే నిర్మలమ్మకు కౌంటర్లు ఇచ్చారు. తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు.

రేషన్ షాపు వద్ద నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన వాటాలు ప్రాజెక్టులకు జాతీయ హోదా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మీరు తెలంగాణకు ఏం తెచ్చారో ముందు చెప్పి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఏపీ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్, బల్క్ డ్రగ్ పార్క్ ని అడ్డుకున్నారని చెప్పారు. ట్రైబల్ యూనివర్సిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్ భగీరథకు కేంద్ర సాయాన్ని కోరినా మొండి చేయి చూపించారని విమర్శించారు. ఇన్ని తప్పులు కేంద్రంపై పెట్టుకుని, తెలంగాణకు వచ్చి రేషన్ షాపులో మోదీ ఫొటో లేదని చిందులు తొక్కడమేంటని ప్రశ్నించారు సత్యవతి రాథోడ్.

పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కట్టింది ఎంత.. మీరు తిరిగి ఇచ్చింది ఎంతో చెప్పాలని ప్రశ్నించారు సత్యవతి రాథోడ్. మన ఊరు- మనబడికి కేంద్రం నిధులు ఇచ్చిందంటున్న నిర్మలమ్మ.. ఆ కాన్సెప్ట్ కేంద్రానిదే అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడంలేదని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కేసీఆర్ ని రాజకీయంగా బలహీనపరచాలనుకునే కుటిల యత్నాలను ప్రజలే అడ్డుకుంటారని చెప్పారు. తెలంగాణలో ఒక్కో పార్లమెంట్ కి ఒక్కో కేంద్రమంత్రి వచ్చి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డికి తెలుగు తప్ప వేరే భాష రాదని, అందుకే ఆయన బీహార్ లో కేసీఆర్-నితీష్ కుమార్ మీటింగ్ పై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రులు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితమవడం ఏంటని నిలదీశారు.

నిర్మలమ్మ టూర్ ఫ్లాప్..

ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కో కేంద్రమంత్రితో రచ్చ చేయాలనుకున్న బీజేపీ గేమ్ ప్లాన్ నిర్మలమ్మ ఎపిసోడ్ తోనే ఫ్లాపైందని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి, తెలంగాణకు ఏం ఇచ్చారు, ఏం తెచ్చారనేది ముందు తేల్చాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News