చైతన్య కాలేజ్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య పై విచారణకు ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాత్విక్ తల్లితండ్రుల ఫిర్యాదుతో చైతన్య కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ లపై పోలీసులు సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు.
నార్సింగి చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విచారణకు ఆదేశించారు. మరో వైపు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.
సాత్విక్ తల్లితండ్రుల ఫిర్యాదుతో చైతన్య కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ లపై పోలీసులు సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు.
కాగా, సాత్విక్ తో సహా విద్యార్థులందరినీ వైస్ ప్రిన్స్ పాల్ ఆచార్య దారుణంగా కొట్టాడని, అందరినీ అవమానిస్తాడని సాత్విక్ సోదరుడు అన్నారు. తన రూంలో ఉరివేసుకున్న సాత్విక్ ను ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి యాజమాన్యం సహకరించలేదని, పైగా తోటి విద్యార్థులు సాత్విక్ ను ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయగా వార్డెన్ అడ్డుకున్నారని, గేటుకు తాళం వేశారని, ఆ తాళాన్ని బద్దలు కొట్టి విద్యార్థులు బైక్ పై సాత్విక్ ను ఆస్పత్రికి తీసుకెళ్ళారని అయితే అప్పటికే అతను చనిపోయాడని సాత్విక్ తల్లి తెలిపింది.
యాజమాన్యం, లెక్చరర్ల ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని సాత్విక్ సోదరుడు ఆరోపించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని తెలిపాడు. రక్తాలు వచ్చేలా కొడుతున్న వీడియోలు తమ వద్ద ఉన్నాయన్నాడు. కించపరిచేలా మాట్లాడటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.5 వేలు రూపాయలు కట్టాల్సి ఉంటే తనను, తన సోదరుడిని బయట నిలబెట్టారని.. ఆ మొత్తం కడితేనే లోపలకు రానిస్తామని హెచ్చరించారని చెప్పుకొచ్చాడు. కాలేజీలో క్యాస్ట్ ఫీలింగ్ సైతం బాగా ఉందని ఆయన ఆరోపించారు. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య కులం పేరుతో విద్యార్థులను వేధిస్తాడని సాత్విక్ సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.