జేబీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం
క్యాంటిన్‌లో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం
సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా డ్రైవర్లతో మాట్లాడారు. టాయిలెట్స్ పరిశించి సంతృప్తి వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బందితో మాట్లాడి వారితో ఫొటోలు దిగారు. బస్టాండ్ ఆవరణ ఎళ్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. బస్టాండ్‌లోని ఫుడ్ స్టాళ్లను పరిశీలించి వాటి యజమానులతో మాట్లాడారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసకుంటామని వ్యాపారులకు హెచ్చరించారు. క్యాంటిన్ ను పరిశీలించి.. ప్రయాణికులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. కార్గో, పార్శిల్ సెంటర్‌ను పరిశీలించి కార్గో సేవల గురించి ఆరా తీశారు. బస్టాండ్‌లో ఎళ్లవేళలా నాణ్యమైన తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాట్ ఫాంలపై డిస్ ప్లే బోర్డులు అందరికీ కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఇతర అధికారులు ఉన్నారు.