రైతుకు చేసే మేలు జాతి సంపద సృష్టికే.. అది రైతుకు ఇచ్చినట్లు కాదు : మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 46 వేల చెరువులు, కుంటలు పునరుద్దరించడమే గాక విద్యుత్, మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు చెప్పారు.

Advertisement
Update:2023-05-15 21:11 IST

ప్రభుత్వాలు రైతుకు చేయూతనిస్తేనే దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్ వ్యవసాయ దేశమని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం మీద దృష్టిపెట్టాలని కోరారు. తెలంగాణలో గత 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి దేశానికి ఒక దిక్సూచిలా అభివృద్ధి చేశామన్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో ఐకార్ ఆధ్వర్యంలోని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులకు శిక్షణ ఇచ్చే విస్తరణ విద్యా సంస్థలో నూతన ఆడిటోరియంను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవపాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 46 వేల చెరువులు, కుంటలు పునరుద్దరించడమే గాక విద్యుత్, మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏటా పదివేల రూపాయ‌ల‌ పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించిందని తెలిపారు.

రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నామని.. ఆయిల్ పామ్ సాగుతో పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంటల నిల్వ కోసం భారీ ఎత్తున గోదాంల నిర్మాణం చేపట్టామన్నారు. పంటలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరిచామని, పంటలకు కనీస మద్దతు ధర దక్కనప్పుడు వరిధాన్యంతో పాటు ఇతర పంటలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యల మూలంగా రైతులకు భరోసా కలిగి వ్యవసాయంపై ఆత్మవిశ్వాసంతో దృష్టి సారిస్తున్నారన్నారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలు రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం అనుసరించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధికి వ్యవసాయం వెన్నెముక లాంటిదన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశోధనా ఫలితాలను రైతుల దగ్గరకు తీసుకెళ్లాలని విస్తరణాధికారులను కోరారు. తెలంగాణలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారన్నారు. తెలంగాణలో చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చాలా వివరంగా చెప్పారన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ రఘునందన్ రావు, విస్తరణ సంచాలకులు డాక్టర్ సుధారాణి, ఈఈఐ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News