మహిళా రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మద్దతు.. వాళ్లకు అండగా ఉందామని పిలుపు
మహిళా రెజ్లర్లు మన దేశానికి ఎంతో ఖ్యాతి తెచ్చారని.. ఇప్పుడు వాళ్లు చేస్తున్న ఆందోళనకు మన మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేసిన మహిళా రెజ్లర్లు వారం రోజులుగా ఢిల్లీలో ఆందోళన బాట పట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చైర్మన్ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ పలువురు రెజ్లర్లు నిరసన చేపట్టారు. ఉమెన్ స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్‌తో పాటు ఏడుగురు రెజర్లు తమ బాధలను తెలుపుతూ రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్ చేస్తున్న అరాచకాలపై క్రీడాకారులు, క్రీడారంగానికి చెందిన వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మహిళా రెజ్లర్లు మన దేశానికి ఎంతో ఖ్యాతి తెచ్చారని.. ఇప్పుడు వాళ్లు చేస్తున్న ఆందోళనకు మన మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒలింపిక్స్ జరిగిన సమయంలో దేశానికి ఖ్యాతి తెచ్చినప్పుడు సంబరాలు చేసుకున్నామని.. ఇప్పుడు వాళ్లు న్యాయం కోసం పోరాడుతుంటే తప్పకుండా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై తప్పకుండా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో రెజ్లర్లు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోలనకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వాళ్లకు న్యాయం జరిగే వరకు తన హృదయపూర్వక మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ తమను వేధింపులకు గురి చేస్తున్నారని, అలాగే లక్నోలోని నేషనల్ క్యాంప్‌లో పలువురు కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేశ్ ఫోగాట్‌తో పాటు ఏడుగురు మహిళా రెజర్లు ఆరోపించారు. దీనిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. బీజేపీకి చెందిన వ్యక్తి కాబట్టే బ్రిజ్ భూషన్‌పై తగిన చర్యలు తీసుకోలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.