ఆ సామెత చాలా పాతది - మంత్రి కేటీఆర్
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే ఉందన్నారు కేటీఆర్. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారని స్పష్టంచేశారు.
"అయినను పోయి రావలె హస్తినకు" అనేది పాత సామెత అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారాయన. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే ఉందన్నారు కేటీఆర్. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారని స్పష్టంచేశారు.
ఎందుకీ సామెత..
ఈ సామెత గురించి ఇప్పుడెందుకు చర్చ వచ్చిందంటే.. నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం సరైన నిర్ణయం కాదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. మహాభారతంలో సంధి కుదరదని తెలిసి కూడా శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన ఘటన నుంచి కేసీఆర్ స్ఫూర్తి పొంది ఉండాలన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులు హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశాన్ని కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టేందుకు, నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఎం కేసీఆర్ ఉపయోగించుకుని ఉండాల్సిందని అన్నారు. "అయినను పోయి రావలె హస్తినకు" అనే సామెతను పరోక్షంగా గుర్తు చేశారు నాగేశ్వర్. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అది పాత సామెత అని, ఈ కాలానికి సరిపోదని, అందుకే ఆ సమావేశాన్ని కేసీఆర్ బాయ్ కాట్ చేశారని చెప్పారు.
పతక విజేతలకు అభినందనలు..
కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులందరికీ మంత్రి కేటీఆర్ పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా అభినందిస్తూ ఆయన ట్వీట్లు వేశారు. లక్ష్యసేన్, పీవీ సింధు, శరత్ కమల్, ఆకుల శ్రీజ, నిఖత్ జరీన్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో వారి అకుంఠిత దీక్షకు తగ్గ ప్రతిఫలం లభించిందని అన్నారు కేటీఆర్.