నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలను కేటీఆర్ వివరించనున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన అక్కడ రెండు వారాల పాటు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని ప్రముఖ కంపెనీలు చైర్మన్లు, సీఈవోలు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలను కేటీఆర్ వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. పూర్తిగా అధికారిక పర్యటన కావడంతో కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు ఇతర అధికారులు కూడా వెళ్లనున్నారు.
రెండు రోజుల క్రితమే యూకే పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్.. సోమవారం ఫాక్స్‌కాన్ తయారీ యూనిట్‌కు సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు మళ్లీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. యూకే పర్యటనలో రాష్ట్రానికి పలు పెట్టుబడులను తీసుకొని వచ్చారు. లండన్ స్టాక్ ఎక్చేంజ్ గ్రూప్ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది.
స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్‌లో ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. దీని ద్వారా 1000 మందికి ఉపాధి లభించనున్నది. ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. క్రోడా ఇంటర్నేషనల్ అనే కెమికల్ ఇండస్ట్రీ.. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. యూకే పర్యటన విజయవంతం కావడంతో.. అమెరికా పర్యటనలో కూడా మరిన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఓకే చెప్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.