రాములు నాయక్‌ను కూల్ చేసిన మంత్రి కేటీఆర్

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం గొప్ప విషయమని రాములు నాయక్ తనతో చెప్పారు. రాములు నాయక్ సహకారంతో వైరా ఎమ్మెల్యేగా మదన్‌లాల్ తప్పకుండా గెలుస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-09-30 12:33 IST

వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌ను ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్న మంత్రి కేటీఆర్.. ఈ రోజు ఉదయం వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..

ప్రత్యేక కారణాల వల్ల రాములు నాయక్‌కు టికెట్ కేటాయించలేక పోయాము. అయినా సరే ఆయన పార్టీ ఆదేశాల మేరకు కట్టుబడి పని చేస్తున్నారని కొనియాడారు. రాములు నాయక్ గొప్ప మానవతావాది అని చెప్పారు. ఎమ్మెల్యేగా రాములు నాయక్ వైరా ప్రజల మనస్సుతో పాటు తన మనసు కూడా గెలుచుకున్నారని ప్రశంసించారు. ఇటీవల చాలా సార్లు తాను రాములు నాయక్‌ను కలిశాను. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు.. తనకు ఎమ్మెల్యే పదవి అనేది ఎండు గడ్డితో సమానం అన్నారు. తనపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉంటే చాలని ప్రకటించడం రాములు నాయక్ హుందాతనానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం గొప్ప విషయమని రాములు నాయక్ తనతో చెప్పారు. రాములు నాయక్ సహకారంతో వైరా ఎమ్మెల్యేగా మదన్‌లాల్ తప్పకుండా గెలుస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మదన్‌లాన్‌ను తప్పకుండా గెలిపించాలని కోరారు. రాములు నాయక్‌ను కూడా తాము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని కేటీఆర్ ప్రకటించారు.

రాష్ట్రంలో పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. టికెట్లు రాని రాజయ్య సైతం అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. అయితే రాములు నాయక్ మాత్రం తన ప్రత్యర్థికి టికెట్ కేటాయించినా పార్టీ లైన్ దాటలేదు. అదే విషయం ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట వెంట వచ్చాయి. ఒక ఎమ్మెల్యేను ఇంతలా ప్రశంసించడం ఇటీవల కాలంలో ఇదే అనే చర్చ జరుగుతున్నది. రాములునాయక్, మదన్ లాల్ కలిసి పని చేస్తే తప్పకుండా వైరాలో బీఆర్ఎస్ గెలుపు సాధ్యమే అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    
Advertisement

Similar News