రామప్పని మిస్ కావొద్దు.. కేటీఆర్ ట్వీట్
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం దర్శనీయ ప్రాంతం అని అన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకూ ఎవరైనా ఈ ఆలయాన్ని చూడకపోతే కచ్చితంగా ఓసారి వచ్చి చూడాలని చెప్పారు.
ములుగు జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో కలియదిరిగారు. స్థానిక అధికారులు, పూజారులు ఆలయ విశిష్టతను మంత్రికి వివరించారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించడం నిజంగా తన అదృష్టం అని అన్నారు కేటీఆర్.
మహిమాన్విత ఆలయం..
రామప్ప దేవాయలం అందమైన కళాకృతులకు నిలయం అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. మహిమాన్విత దేవాలయం అన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో రామప్ప ఆలయాన్ని చేర్చడం సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. ఆనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి, కళాత్మకతకు రామప్ప ఆలయం నిలువుటద్దం అని అన్నారు.
దర్శనీయ ప్రాంతం..
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం దర్శనీయ ప్రాంతం అని అన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకూ ఎవరైనా ఈ ఆలయాన్ని చూడకపోతే కచ్చితంగా ఓసారి వచ్చి చూడాలని చెప్పారు. కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలున్నాయి. గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు ఆలయాన్ని కట్టించారని చరిత్ర. ఆలయంలో ఉన్న దైవం పేరుమీదుగా కాకుండా దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఆలయం పేరు ప్రాచుర్యంలో ఉండటం ఇక్కడ విశేషం.