కర్నాటకలో కరెంటు కష్టాలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

కరెంటు సరఫరాలో కాంగ్రెస్ అసమర్థత.. తెలంగాణ రైతులకు అనుభవంలో ఉన్న విషయమేనన్నారు కేటీఆర్. దశాబ్దాలపాటు ఆ కష్టాలు వారు అనుభవించారని, ఇప్పుడు కర్నాటక ప్రజలకు ఆ కష్టం తెలిసొచ్చిందని చెప్పారు.

Advertisement
Update:2023-10-21 14:56 IST

కర్నాటకలో రైతుల కరెంటు కష్టాలపై సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విద్యుత్ సబ్ స్టేషన్లు, కరెంటు ఆఫీసుల్ని రైతులు చుట్టుముడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా కనీసం 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు పురుగుల మందు తాగేందుకు సిద్ధపడుతున్నారు. మరోచోట ఏకంగా మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీస్ ముందు పెట్టి నిరసన తెలిపారు. కరెంటివ్వకపోతే ఆఫీస్ లో మొసలిని వదిలిపెడతామని హెచ్చరించారు. కర్నాటకలో ఎక్కడ చూసినా ఇలాంటి సన్నివేశాలు కలకలం రేపుతున్నాయి. ఈ దశలో కర్నాటక కరెంటు కష్టాలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


కరెంటు సరఫరాలో కాంగ్రెస్ అసమర్థత.. తెలంగాణ రైతులకు అనుభవంలో ఉన్న విషయమేనన్నారు కేటీఆర్. దశాబ్దాలపాటు ఆ కష్టాలు వారు అనుభవించారని, ఇప్పుడు కొత్తగా కర్నాటక ప్రజలకు ఆ కష్టం తెలిసొచ్చిందని చెప్పారు. కర్నాటకలో కరెంటు కోసం రైతులు చేపట్టిన నిరసనల వీడియోలను ఆయన ట్యాగ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పాలనలో కర్నాటక ఎలా ఉందో పోల్చి చూడాలని ఆయన పరోక్షంగా సూచించారు.

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. రైతులకు 8 గంటలు కరెంటు ఇవ్వాల్సి ఉన్నా.. అది సాధ్యం కావడంలేదు. 5 గంటలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, కనీసం 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వ ఆఫీసులను ముట్టడించి నిరసన తెలియజేస్తున్నారు. కానీ కర్నాటక ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలంటూ హడావిడి చేస్తున్న నేతలు, కర్నాటక పరిస్థితిపై ప్రశ్నిస్తే మాత్రం మొహం చాటేస్తున్నారు. కర్నాటక ఉదాహరణలు తెలంగాణ రైతాంగానికి కనువిప్పులా మారే పరిస్థితి కనపడుతోంది. అందుకే కాంగ్రెస్ కంగారు పడుతోంది. కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కర్నాటక పరిస్థితి తెలంగాణలో తెచ్చుకోవద్దని ప్రజలకు హితవు పలుకుతున్నారు. 


Tags:    
Advertisement

Similar News