లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ.. కేటీఆర్ ట్వీట్..!
తాజాగా హైదరాబాద్ సిగలో మరో కొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సెంట్రల్ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు కొత్త అందాలు సంతరించుకుందని చెప్పారు.
హైదరాబాద్ సిటీ కొత్త అందాలతో ముస్తాబవుతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ఇప్పుడు ఐకానిక్ నిర్మాణాలు మరింత ప్రతిష్టను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే సెక్రటేరియట్ నిర్మాణం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో సాగరతీరం రూపురేఖలే మారిపోయాయి. పర్యాటకులను ఆకర్షించేలా హుస్సేన్ సాగర తీరం రూపుదిద్దుకుంటోంది.
తాజాగా హైదరాబాద్ సిగలో మరో కొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సెంట్రల్ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు కొత్త అందాలు సంతరించుకుందని చెప్పారు. జలవిహార్ పక్కన పది ఎకరాల్లో HMDA అభివృద్ధి చేసిన లేక్ ఫ్రంట్ పార్క్ వీడియోను ట్వీట్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ పార్కును ప్రారంభిస్తామని, అందరూ బోర్డ్‌వాక్‌ని సందర్శించి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇదే సందర్భంలో HMDA అధికారులను అభినందించారు కేటీఆర్. నిర్వహణలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-HMDA పది ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేసింది. ఈ పార్కులో ఏర్పాటు చేసిన అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ మార్గాలు, వాటర్ ఛానల్ డెక్, సరస్సు నీటి మీద వరకు వెళ్లేలా గ్లాస్ డెక్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వీటికి అదనంగా పిల్లలు వినూత్నమైన ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.