2050 కోసం ముందస్తు ప్రణాళిక.. 'సుంకిశాల' పురోగతిపై కేటీఆర్ ట్వీట్

మినిమం డ్రాయల్‌ డౌన్‌ లెవెల్‌ కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. 2024 వేసవి నాటికి సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2023-06-20 11:32 IST

ప్రపంచ నగరాలను తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. అదే సమయంలో హైదరాబాద్ జనాభా కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకి అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రభుత్వానికి కత్తిమీద సామే. కానీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ వాసుల అవసరాలకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలకోసం ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్ట్ లు 2050ని దృష్టిలో ఉంచుకుని పూర్తి చేస్తున్నారు. అంటే 2050నాటికి హైదరాబాద్ లో పెరగబోయే జనాభాకు తగ్గట్టుగా నీటి లభ్యతకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024నాటికి సుంకిశాల పూర్తయితే 2050 వరకు హైదరాబాద్ మంచినీటికి ఎలాంటి ఢోకా ఉండదు.


సుంకిశాల అంటే..?

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో సుంకిశాల వద్ద నిర్మిస్తున్న మంచినీటి ప్రాజెక్ట్ ఇది. 2215 కోట్ల రూపాయల ఖర్చుతో వచ్చే ఏడాదికి పూర్తయ్యేలా దీన్ని నిర్మిస్తున్నారు. సుంకిశాల పనులు వేగంగా పూర్తవుతున్నాయంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2024నాటికి ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.


ప్రస్తుతం కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ నగరానికి నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్‌ ద్వారా తరలిస్తున్నారు. అయితే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం 510 అడుగుల కంటే దిగువకు పడిపోతే సమస్య మొదలవుతుంది. అప్పుడు డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా సుంకిశాల వద్ద అతి పెద్ద ఇన్ టేక్ వెల్ నిర్మిస్తున్నారు. సుమారు 170 మీటర్ల లోతు, 40 మీటర్ల వెడల్పున ఇక్కడ ఇన్ టేక్ వెల్ నిర్మించి, 20 టీఎంసీల కృష్ణా జలాలను నగరానికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మండువేసవిలో కూడా సాగర్ నీళ్లు అడుగంటినా కూడా ఈ ఇన్ టేక్ వెల్ ద్వారా హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుబాటులో ఉంటుంది. మినిమం డ్రాయల్‌ డౌన్‌ లెవెల్‌ కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. 2024 వేసవి నాటికి సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News