బండిపై చర్యలేవి స్పీకర్ సర్..?
బండి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. స్పీకర్ ట్విట్టర్ హ్యాండిల్ ని మెన్షన్ చేస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.
అవిశ్వాత తీర్మానంపై లోక్ సభలో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ ని విమర్శించే స్థాయి బండికి లేదన్నారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. పార్లమెంట్ లో అభ్యంతరకరమైన భాష వాడిన ఎంపీ బండి సంజయ్ పై చర్యలు తీసుకోరా స్పీకర్ సర్ అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
రాహుల్ కి ఓ న్యాయం.. బండికి ఇంకో న్యాయమా..?
మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గగ్గోలు పెట్టింది. చివరకు రాహుల్ కి శిక్షపడి, తద్వారా లోక్ సభ సభ్యత్వం రద్దు కావడానికి కూడా కారణం బీజేపీ నేతలే. మోదీ అనే ఇంటిపేరుపై సెటైర్ వేసినందుకే రాహుల్ కి అంత పెద్ద శిక్ష వేశారే, ఇప్పుడు బండి సంజయ్ ని ఎలా ఉపేక్షిస్తారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన ప్రజా నేత కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లో ఆయన వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం అన్నారు కేటీఆర్.
మీరు చేస్తే సంసారం..
రాహుల్ గాంధీ ఎక్కడో ఎన్నికల ప్రచార సభలో మోదీ గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ పార్లమెంట్ లో సభలో లేని ఓ సీఎం గురించి ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అప్పుడే స్పందించారు, తీవ్రంగా తప్పుబట్టారు. అయితే ఇప్పుడు బండి వ్యవహారంలో మనం ఏం చేయగలమో చెప్పండి సర్ అంటూ స్పీకర్ ని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బండి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. స్పీకర్ ట్విట్టర్ హ్యాండిల్ ని మెన్షన్ చేస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి. వైరి వర్గాలు చేసిన విమర్శలను అంతగా పట్టించుకునే బీజేపీ నేతలు, ఇతరులను విమర్శించే సమయంలో మాత్రం హద్దులు దాటొచ్చా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.