లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియంలో మంత్రి కేటీఆర్.. బాబా సాహెబ్‌కు నివాళులు
హైదరాబాద్‌లో ఆవిష్కరించిన భారీ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన రిప్లికాను భారత హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీరంజని కనగవేల్ ద్వారా మ్యూజియానికి మంత్రి కేటీఆర్ అందించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్.. లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. లండన్‌లో ఉన్న సమయంలో అంబేద్కర్ నివసించిన ఇంటినే.. ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. అక్కడ అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన ప్రతీ విషయాన్ని పొందు పరిచారు. మ్యూజియం ఆసాంతం కలియదిరిగిన మంత్రి కేటీఆర్.. అక్కడి నిర్వాహకులు వివరించిన విషయాలు ఆసక్తిగా విన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించిన భారీ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన రిప్లికాను భారత హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీరంజని కనగవేల్ ద్వారా మ్యూజియానికి అందించారు. ఈ రిప్లికాను లండన్‌లోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. అలాగే భారత హై కమిషనర్‌కు అంబేద్కర్ పోట్రయట్‌ను బహుకరించారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఫాబో ప్రశంసలు..
అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను ది ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ అండ్ బుద్దిస్ట్ ఆర్గనైజేషన్స్ యూకే (ఫాబో) ప్రశసంసించింది. సంస్థ అధ్యక్షుడు సంతోశ్ దాస్, సంయుక్త కార్యదర్శి సి. గౌతమ్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను మంత్రి కేటీఆర్‌కు అందించారు.
'జాతి నిర్మాణం, అట్టడుగు వర్గాల ఉన్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రపంచంలోనే భారీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఇది కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణం. రాష్ట్ర సచివాలయానికి కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం తప్పకుండా బాబా సాహెబ్ పట్ల ఉన్న గౌరవానికి సూచికగా భావిస్తున్నాము' అని లేఖలో పేర్కొన్నారు. ఫాబో యూకే సభ్యులు మంత్రి కేటీఆర్‌ను సన్మానించారు. అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నామో మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వారికి వివరించారు.