దావోస్ కి బయలుదేరిన కేటీఆర్ బృందం.. రేపటినుంచి సదస్సు మొదలు
శనివారం సాయంత్రం దావోస్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ బృందం ఈ మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకుంటుంది. సాయంత్రం 5.30 గంటలనుంచి అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్.
దావోస్ లో జరగబోతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ఐటీ మంత్రి కేటీఆర్ తన టీమ్ తో కలసి బయలుదేరారు. ఆయన వెంట ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఆటోమోటివ్ విభాగం డైరెక్టర్ గోపాల్ కృష్ణన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ సదస్సు జరుగుతుంది.
జ్యురిచ్ నుంచి దావోస్..
శనివారం సాయంత్రం దావోస్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ బృందం ఈ మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకుంటుంది. సాయంత్రం 5.30 గంటలనుంచి అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్. ఆయనకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత జ్యూరిచ్ నుంచి దావోస్ కి వెళ్లి నాలుగురోజులపాటు అక్కడ సదస్సులో పాల్గొంటుంది కేటీఆర్ బృందం. ఈ ఏడాది సదస్సును ‘కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు.
గతేడాది దావోస్ నుంచి 4200 కోట్ల రూపాయల పెట్టుబడులతో కేటీఆర్ బృందం తిరిగొచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలతో ఒప్పందాలు కుదురుతాయని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తి స్థాయిలో కుదుటపడటంతో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు తరలివచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, మానవ వనరులు, అనుకూల వాతావరణం, అభివృద్ధిలో హైదరాబాద్ స్థానం.. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణ మంత్రాలు. వీటన్నిటికీ మించి కేటీఆర్ ప్రసంగాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఢోకా ఉండదు అనే భరోసానిస్తాయి. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలు తెలంగాణకు తరలి వస్తున్నాయి.