సాధించాం కాబట్టే చెప్పుకుంటున్నాం.. మీకేం నొప్పి..?

కడుపు నింపిన కేసీఆర్ కావాలా, కడుపుకోత మిగిల్చిన కాంగ్రెస్ కావాలా..? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి జరిగింది కాబట్టే 21రోజులపాటు సంబురాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Advertisement
Update:2023-06-17 21:54 IST

తెలంగాణ దశాబ్ది సంబరాలపై కొంతమంది అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. అసలు దశాబ్ది ఉత్సవాలెందుకని కొంతమంది అడుగుతున్నారని, అలాంటి వారికి తెలంగాణ అభివృద్ధి కనపడటంలేదా అని ప్రశ్నించారు. 9ఏళ్లలోనే తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్-1 గా నిలిచిందని.. అభివృద్ధి చేసి చూపించాం కాబట్టే చెప్పుకుంటున్నామని అన్నారు కేటీఆర్. అందులో ప్రతిపక్షాలకు ఏం నొప్పి అని ప్రశ్నించారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీకి సంబంధించిన ఫ్యాక్టరీలకు భూమి పూజతోపాటు వరంగల్ లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్.. అనంతరం వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి జరిగింది కాబట్టే 21రోజులపాటు సంబురాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.


గిరిజన దినోత్సవం చేసుకోవాల్సిన అవసరం ఏంటో వివరించారు మంత్రి కేటీఆర్. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ వాళ్లు పట్టించుకోకపోయినా, సీఎం కేసీఆర్ 3416 గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చారని గిరిజన దినోత్సవం ఎందుకు జరుపుకోకూడదని ప్రశ్నించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్య, వైద్యం అన్నింటిలో తెలంగాణ ముందు ఉందని చెప్పారు. పంజాబ్ ని తలదన్నే విధంగా తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు.

కడుపుకోత మిగిల్చిన కాంగ్రెస్ కావాలా..?

కడుపు నింపిన కేసీఆర్ కావాలా, కడుపుకోత మిగిల్చిన కాంగ్రెస్ కావాలా..? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. మోచేతికి బెల్లం పెట్టి నాకండి అని చెప్పేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తుంటారని, వారిని చూసి ఆగం కావొద్దన్నారు. వరంగల్ అభివృద్ధిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ని చేతగాని ప్రధాని అని విమర్శించిన మోదీ ఇప్పుడు ఏం చేస్తున్నారని అన్నారు. మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు 400 రూపాయలుగా ఉందని, ఇప్పుడు 1200 రూపాయలు అయిందని ఎవరు అతిపెద్ద అవినీతిపరుడు, ఎవరు అతి పెద్ద అసమర్థుడు అని నిలదీశారు. 

Tags:    
Advertisement

Similar News