తెలంగాణలో ఐటీ అభివృద్ధి.. అసలు కారణం చెప్పిన కేటీఆర్
హైదరాబాద్ లోని బేగంపేటలో 1987లోనే ఇంటర్ గ్రాఫ్ అనే ఐటీ బిల్డింగ్ వచ్చిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కు ఐటీ తామే తెచ్చామనే వారు ఈ విషయం తెలుసుకోవాలన్నారు.
దేశంలో ఉన్న ఐటీ పురోగతితో పోలిస్తే, తెలంగాణలో ఐటీ అభివృద్ధి 4 రెట్లు ఎక్కువగా ఉంది. రాష్ట్రం నుంచి ఏడాదికేడాది ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. దేశంలో కొత్తగా వస్తున్న టెక్నాలజీ జాబ్స్ లో 44 శాతం తెలంగాణవే. ఈ ఘనత ఎలా సాధ్యమయ్యిందనే విషయాన్ని అసెంబ్లీలో వివరించారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ఈరోజు జరిగిన ప్రశ్నోత్తరాల సమావేశంలో ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్ షిప్
తెలంగాణలో స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్ షిప్ ఉందని, దీనివల్లే ఐటీ పురోగతి సాధ్యమైందని చెప్పారు మంత్రి కేటీఆర్. గురుగ్రామ్‌లో మత ఘర్షణలతో ఐటీ పరిశ్రమ నాశనం అవుతోందని, మణిపూర్ లో తెగల మధ్య కొట్లాట పెట్టారని అన్నారు. కానీ తెలంగాణలో మతాల పంచాయతీ లేదు, కులాల మధ్య కొట్లాట లేదని చెప్పారు కేటీఆర్. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. బెంగళూరుని కూడా వెనక్కు నెట్టి ఐటీ ఉద్యోగాల్లో ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు కేటీఆర్. దేశంలో ఐటీ రంగంలో 100 ఉద్యోగాలు వస్తే అందులో 44 తెలంగాణ నుంచి వచ్చాయని, ఇది గర్వపడాల్సిన సందర్భం అన్నారు.
హైదరాబాద్ లోని బేగంపేటలో 1987లోనే ఇంటర్ గ్రాఫ్ అనే ఐటీ బిల్డింగ్ వచ్చిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ కు ఐటీ తామే తెచ్చామనే వారు ఈ విషయం తెలుసుకోవాలన్నారు. 1987 నుంచి 2014 వరకు 27 ఏళ్లలో ఐటీ రంగం ఎగుమతుల పరిమాణం 56వేల కోట్ల రూపాయలు అని చెప్పిన మంత్రి.. గతేడాది తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ. 57,707 కోట్లు అని వివరించారు. తెలంగాణ ఏర్పడక ముందు 27 ఏళ్లలో సాధించిన దాన్ని, ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే అధిగమించామని అసెంబ్లీలో వివరించారు మంత్రి కేటీఆర్.