కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా ఆ పని చేయిస్తా..
పిల్ల దొరక్క ముందే పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్టు డిసెంబర్-9న సీఎం ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ వాళ్లు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. కొడంగల్ లో బీఆర్ఎస్ ర్యాలీకి వచ్చిన ఆదరణ చూస్తే.. రేవంత్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుని పారిపోవడం గ్యారెంటీ అన్నారు.
ఆర్మూర్ ర్యాలీలో ప్రమాదానికి గురై కాస్త ఇబ్బంది పడినా.. విశ్రాంతి లేకుండానే కొడంగల్ బయలుదేరారు మంత్రి కేటీఆర్. కొడంగల్ లో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టారు. ఇది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో బీఆర్ఎస్ ఇక్కడి గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించిన నరేందర్ రెడ్డి.. మరోసారి ఆయనకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ నుంచి బరిలో దిగారు. ఆయన గెలుపుకోసం మంత్రి కేటీఆర్ ప్రచారానికి వచ్చారు.
నరేందర్ కి ప్రమోషన్ గ్యారెంటీ..
కొడంగల్ ర్యాలీలో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈసారి కూడా నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా ఆయనకు ప్రమోషన్ వచ్చేలా చేస్తానన్నారు. నరేందర్ కు మంత్రి పదవి వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. కొడంగల్ లో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగరాలని చెప్పారు కేటీఆర్. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిన దొంగ, ఫోర్ ట్వంటీ, చిల్లరగాడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు కేటీఆర్. కొడంగల్ నియోజకవర్గ పేరుని అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టారని మండిపడ్డారు. అలాంటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ కి సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టు.. రేవంత్, కేసీఆర్ ని ఉద్దేశించి సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు. నీకు కేసీఆర్ అవసరం లేదు, మా నరేందర్ రెడ్డి కచ్చితంగా ఓడగొడతారని రేవంత్ రెడ్డికి బదులిచ్చారు కేటీఆర్.
రేవంత్ నామినేషన్ ఉపసంహరించుకోవడం ఖాయం..
పిల్ల దొరక్క ముందే పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్టు డిసెంబర్-9న సీఎంగా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ వాళ్లు సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. కొడంగల్ లో బీఆర్ఎస్ ర్యాలీకి వచ్చిన ఆదరణ చూస్తే.. రేవంత్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుని పారిపోవడం గ్యారెంటీ అన్నారు. వరుసగా రెండోసారి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ వంటి బక్కపలుచని వ్యక్తిని కొట్టడానికి ఢిల్లీ నుంచి చాలామంది ఇక్కడకు వస్తున్నారని, కర్నాటక నుంచి కూడా చాలామంది వస్తున్నారని.. కానీ సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ కి మనం అందరం అండగా నిలబడాలని, కేసీఆర్ ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.