అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంది.. సైకిల్ బెల్ అనుకోవద్దు
కులం, మతం తిండి పెట్టవని.. కానీ వీటిని ఆ రెండు పార్టీలు ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని చెప్పారు కేటీఆర్.
అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంటే, పొరపాటున సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇవ్వాలని చూడొద్దన్నారు మంత్రి కేటీఆర్. ప్రచారం చివరి రోజున తన నియోజకవర్గం సిరిసిల్లతోపాటు, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కామారెడ్డిలో కూడా కేటీఆర్ పర్యటించారు. కామారెడ్డికి కేసీఆర్ వచ్చి పోటీ చేస్తున్నారని, ఆయన తనకు తానే వచ్చారంటే.. అదృష్టం వచ్చి మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టినట్టేనని చెప్పారు కేటీఆర్. ఆయనను కాదనుకొని ఇతర మార్గాల వైపు చూడొద్దని సూచించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ ఇక్కడికి వస్తే భూములు లాక్కుంటారని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి భూముల్లో ఏమైనా లంకె బిందెలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎం వచ్చి భూములు లాక్కోవడం ఏంటని, ఆరోపణలు చేయడానికయినా కాస్త లాజిక్ ఉండాలి కదా అన్నారు. కేసీఆర్ వస్తే వెంట చాలా వస్తాయని కామారెడ్డి అభివృద్ధి చెందుతుందన్నారు కేటీఆర్.
కులం, మతం తిండి పెట్టవని.. కానీ వీటిని ఆ రెండు పార్టీలు ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని చెప్పారు కేటీఆర్. అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఎవరెవరో చెప్పారని ఆగం కావద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కామారెడ్డి ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం అంటే అక్కడి ప్రజలకు ఏ పని కూడా కాకుండా పోదన్నారు. అధికారులు కూడా ఫస్ట్ ప్రయారిటీ వారికే ఇస్తారని చెప్పారు కేటీఆర్.