సచివాలయ ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ సమీక్ష

దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టినందున తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు.

Advertisement
Update:2023-02-09 21:44 IST

ఈనెల 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్స్ సభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌ లో సమీక్ష నిర్వహించిన ఆయన, పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని దిశా నిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పెట్టిన ఖమ్మం, నాందేడ్ సభలకు ఊహించని రీతిలో జనం వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పెడుతున్న సభకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేలమంది హాజరయ్యేలా చూడాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన పలు సూచనలు చేశారు.


ఈనెల 13న గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు కేటీఆర్. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించబోతున్నట్టు తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు.

అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు..

దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టినందున తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌ గ్రౌండ్‌ సభను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News