హైదరాబాద్ లో కేటీఆర్ పర్యటన.. అధికారులతో సమీక్ష

హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు మంత్రి కేటీఆర్. డీసిల్టింగ్ ఇప్పటికే పూర్తయిందని, చెరువుల బలోపేతానికి తీసుకున్న చర్యల వల్ల నష్టం అదుపులో ఉందన్నారు.

Advertisement
Update:2023-07-27 15:21 IST

వర్షాలు, వరదలకు ప్రాణ నష్టం జరగకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యం అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారాయన. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని చెప్పారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలన్నారు. హైదరాబాద్ నుంచి పురపాలక శాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ కి రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు మంత్రి కేటీఆర్. డీసిల్టింగ్ ఇప్పటికే పూర్తయిందని, చెరువుల బలోపేతానికి తీసుకున్న చర్యల వల్ల నష్టం అదుపులో ఉందన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించామని చెప్పారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవని, ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం వలన వరద ప్రభావం కాస్త తగ్గిందన్నారు ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం.. 24 గంటలు వర్షాలను ఎదుర్కోడానికి పనిచేస్తోందన్నారు. పురపాలక ఉద్యోగులకు అన్ని సెలవలు రద్దు చేశామని ప్రకటించారు కేటీఆర్.


రాజకీయాలొద్దు..

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని సూచించారు మంత్రి కేటీఆర్. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించ వద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర సిబ్బంది.. అన్ని జిల్లాల్లోని అధికారులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని, మున్సిపల్ ఉన్నతాధికారులను అక్కడికి వెళ్లాలని ఆదేశించానని, అవసరమైతే తాను కూడా రేపు వరంగల్ వెళ్తానన్నారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News