లక్షన్నరమందితో పాలమూరు ప్రారంభోత్సవ సభ
గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని, సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అయినట్టు అని చెప్పారు మంత్రి కేటీఆర్.
ఈనెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి లక్షన్నరమంది రైతులు వస్తారని అంచనా. ఈ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఇతర అధికారులతో ఆయన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.
16వ తేదీ జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ గొప్ప సందర్భాన్ని మరింత గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు విశిష్టత ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకుంటామని చెప్పారు. మంత్రులు సంబంధిత ఎమ్మెల్యేలతో సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకోవాలన్నారు.
అప్పుడు వలసలు, ఇప్పుడు పంటలు..
వలసల జిల్లాగా పేరుబడిన పాలమూరు నేడు పచ్చని పైరులతో కలకలలాడుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రతి ఏటా లక్షల మంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయికి చేరుకుందన్నారు. పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందుతోందని చెప్పారు.
బీఆర్ఎస్ ఘనత ఇది..
గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని, సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అయినట్టు అని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారత దేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉందని అన్నారు. ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించేవారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని అన్నారు.