వేసవికి తాగునీటి ప్రణాళిక ఏది..? అధికారులకు కేటీఆర్ ప్రశ్నలు
వరంగల్ నగరంలోని 66 డివిజన్లకు తాగునీరు అందించేందుకు రూ.50 కోట్లతో వేసవి ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు మంత్రి కేటీఆర్ కు వివరించారు. ఆ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని మంత్రి వారికి సూచించారు.
వచ్చే వేసవికి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది..? వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. నగర ప్రజలకు రోజూ తాగునీరు ఎందుకివ్వడం లేదు? ఏడాది నుంచి చెబుతున్నా ఎందుకు అమలు చేయడం లేదు? కారణాలేంటి..? అంటూ ప్రశ్నలు సంధించారు. వరంగల్ నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారాయన.
రూ.50కోట్లతో ప్రణాళిక..
వరంగల్ నగరంలోని 66 డివిజన్లకు తాగునీరు అందించేందుకు రూ.50 కోట్లతో వేసవి ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు మంత్రి కేటీఆర్ కు వివరించారు. ఆ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని మంత్రి వారికి సూచించారు. వారం రోజులుగా వరంగల్ లో తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, భవిష్యతులో తలెత్తే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. తాగునీరు అందుబాటులో ఉన్నా, నీటి శుద్ధీకరణ కేంద్రాలున్నా కూడా రోజూ ఎందుకివ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు కేటీఆర్.
‘న్యాక్’ సంస్థలో శిక్షణ పొందిన 130 మందిని కాంట్రాక్ట్ పద్దతిన నియమించేందుకు అక్కడికక్కడే మంత్రి ఆమోదం తెలిపారు. వరంగల్ నగరంలో నీటి సరఫరా మెరుగు పరిచేందుకు రాష్ట్ర స్థాయిలో అనుభవం ఉన్న రిటైర్డ్ ఇంజినీర్ ని పంపించాలన్నారు. వరంగల్, హన్మకొండ బస్టాండ్ల ఆధునికీకరణ, ఇన్నర్ రింగురోడ్డు పనులు తక్షణం ప్రారంభించాలన్నారు. అకాల వర్షాలతో ముంపు ముప్పు లేకుండా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలన్నారు. స్మార్ట్ సిటీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్.