వానాకాలం జర జాగ్రత్త.. అధికారులతో కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్, భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలను వివరించారు. నగర పరిధిలో ఉన్న చెరువుల నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వానాకాలం వస్తోంది, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని మున్సిపాల్టీలతోపాటు, హైదరాబాద్ నగరంలో వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై వివిధ విభాగాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వానాకాలంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు ఇతర ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. మ్యాన్‌హోల్స్, నాలాలు, వరదనీటి కాలువల వల్ల గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ విషయంలో బీ అలర్ట్..
హైదరాబాద్ నగరంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలను వివరించారు. GHMC చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం (SNDP) పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. నగర పరిధిలో ఉన్న చెరువుల నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వార్డు కార్యాలయాల పనితీరుపై ఆరా..
GHMC లో ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరు పై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలో ఉందని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రతిరోజు వార్డు కార్యాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పర్యవేక్షించాలని సూచించారు. నగర పౌరులు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకొనేలా ప్రయత్నాలు చేయాలన్నారు.
వార్డు కార్యాలయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ఒక ఐటీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు కేటీఆర్. అన్ని విభాగాల అధికారులు ప్రత్యేకంగా అంతర్గత సమీక్షలు నిర్వహించుకొని వార్డు కార్యాలయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడారు. వార్డు కార్యాలయాల ద్వారా వారి సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.