మోదీకి వైద్య శాస్త్రంలో నోబెల్.. కేటీఆర్ ప్రతిపాదన..
మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉద్వేగంతో ప్రసంగించిన కిషన్ రెడ్డి, ప్రధాని మోదీని శాస్త్రవేత్తగా మార్చేశారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మోదీయేనంటూ అసలు రహస్యం బయటపెట్టారు.
"భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారు." చదువుకోనివారు ఎవరైనా ఈ కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వారి అవగాహన అంతేలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ సాక్షాత్తూ కేంద్రమంత్రి, ఇలా మోదీని శాస్త్రవేత్తగా మార్చేశారంటే ఏమనుకోవాలి. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి ఆ తప్పులో కాలేశారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉద్వేగంతో ప్రసంగించిన కిషన్ రెడ్డి, ప్రధాని మోదీని శాస్త్రవేత్తగా మార్చేశారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది మోదీయేనంటూ అసలు రహస్యం బయటపెట్టారు.
"మన దేశంలో మన ప్రధానమంత్రి ధైర్యం చేశారు. మందు కనుగొన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు." ఇదీ కిషన్ రెడ్డి స్టేట్ మెంట్. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోదీని శాస్త్రవేత్తగా మార్చిన కిషన్ రెడ్డి అంటూ కౌంటర్లు పడుతున్నాయి. ఇన్నాళ్లూ కరోనా వ్యాక్సిన్ ని శాస్త్రవేత్తలు కనిపెట్టారని అనుకుంటున్నామని, కానీ మోదీ అని తెలిశాక తమకి జ్ఞానోదయం అయిందని కూడా సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ఈ సెటైర్ల పరంపరలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరిపోయింది. ఏకంగా మోదీకి నోబెల్ ప్రైజ్ డిమాండ్ చేశారు కేటీఆర్.
"మనమంతా వైద్య విభాగంలో మోదీకి నోబెల్ ప్రైజ్ డిమాండ్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఆయన ధైర్యంగా కొవిడ్ కి వ్యాక్సిన్ కనుగొన్నారు. కేంద్ర మంత్రులు నిజంగా తెలివైనవారు, వారి తెలివికి జోహార్లు చెప్పాల్సిందే"నంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రధాని గురించి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.
మోదీని రాముడు, దేవుడు అంటూ కీర్తించే భక్తజనం చాలామందే ఉన్నారు. కానీ ఆయన్ని శాస్త్రవేత్తగా మార్చిన ఘనత మాత్రం కిషన్ రెడ్డికే దక్కింది. మునుగోడులో ఇలాంటి ప్రచారాలతో బీజేపీ జనాల్ని ఆకట్టుకోవాలని చూస్తోంది. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టినవాళ్లు కూడా మరీ ఇంతలా ప్రచారం చేసుకోలేదు. కానీ మోదీ మాత్రం భారత ప్రజల ప్రాణదాతలాగా ప్రతి పెట్రోల్ బంక్ లోనూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారానికి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు పరాకాష్ట, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ కేటీఆర్ చేసిన ప్రతిపాదన మరో హైలెట్.