రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యంగబద్దంగా ఏర్పడిన సంస్థ అని, దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయం కూడా అవగాహన లేకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.

Advertisement
Update:2023-03-23 20:24 IST

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన వ్యవహారంలో నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వారిద్దరూ కుట్ర చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అందుకే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యంగబద్దంగా ఏర్పడిన సంస్థ అని, దానికి స్వయం ప్రతిపత్తి ఉంటుందనే విషయం కూడా అవగాహన లేకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలోకి అనవసరంగా ప్రభుత్వాన్ని, తనను లాగడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండానే సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయ్యిందనే విషయం వారికి తెలియడం లేదని.. ఆ సంస్థ స్వతంత్రంగానే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతుందని కేటీఆర్ వివరించారు. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టి.. మొత్తం వ్యవహారానికి ప్రభుత్వమే కారణం అనేలా, ప్రభుత్వ పరిధిలోనే ఈ వ్యవహారం జరిగిందనేలా కుట్ర పూరితంగా, దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

ప్రభుత్వ పరిపాలన, ఇతర వ్యవహారల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. తెలివి తక్కువతనంతో అవాకులు, చెవాకులు పేలుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టేలా మాట్లాడుతూ.. కావాలనే టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో పదే పదే తన పేరును లాగేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బట్టకాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను తాను సహించబోనని కేటీఆర్ హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తమ తెలివి తక్కువ, మతిలేని ప్రకటనలతో ప్రజల్లో చులకనకు గురయ్యారని కేటీఆర్ అన్నారు. గతంలో కూడా కోవిడ్ సందర్భంగా.. రూ.10 వేల కోట్ల వ్యాక్సిన్ కుంభకోణం జరిగిందని.. వేల కోట్ల విలువ చేసే నిజాం నగల కోసమే సచివాలయం కూల్చి వేస్తున్నారనే తిక్క ఆరోపణలు చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎప్పుడో నవ్వులపాలు అయ్యారు. రేవంత్ రెడ్డితో పోటీ పడి మరీ.. శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహితమైన వ్యాఖ్యలను కూడా ప్రజలు గమనించారని కేటీఆర్ అన్నారు.

వీరిద్దరి వ్యవహారశైలి గమనిస్తే.. మానసిక సంతులనం కోల్పోయారేమో అని ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు వీరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనుక మొత్తం ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలనే భయంకరమైన కుట్ర దాగి ఉందనే కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఈ నాయకులే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ వ్యాఖ్యలు, వారి రాజకీయాలు కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయని కేటీఆర్ అన్నారు. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు శవాలపై చిల్లర ఏరుకునే రాజకీయ రాబంధుల్లా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తలాతోకా లేకుండా మాట్లాడుతున్న ఈ పిచ్చి నాయకుల మాటల ఉచ్చులో పడకుండా.. యువత పోటీ పరీక్షలకు సన్నద్దమవడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.

టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని.. రాబోయే కాలంలో నిర్వహించే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కమిషన్ సన్నద్దం అవుతుందని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగవని అధికారులు చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ దుర్మార్గపూరిత కుట్రలు, ప్రచారం జరుగుతున్నాయని.. విద్యార్థులు ఇలాంటి విషయాలను నమ్మవద్దని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


Tags:    
Advertisement

Similar News