పచ్చి అవకాశవాది, అహంకారి..
ఆ అహంకారి మదం దించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పచ్చి రాజకీయ అవకాశవాది, డబ్బు మదం ఉన్న వ్యక్తి అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. మునుగోడు ప్రజల్ని ఆయన అంగడి సరకులా భావిస్తారని, అందుకే కేవలం ఎన్నికల సమయంలోనే ఆయన జనంలోకి వస్తారని చెప్పారు. ఆ అహంకారి మదం దించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు.
2018లో మునుగోడులో గెలిచిన రాజగోపాల్ రెడ్డి... కాంగ్రెస్ లో గెలిచి ఎందుకు రాజీనామా చేశాడో, ఎందుకు బీజేపీలోకి పోయాడో, ఎందుకు ఎలక్షన్ తెచ్చాడో, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెనక్కి ఎందుకెళ్లాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. కేవలం రాజకీయ స్వలాభం కోసమే ఆయన పార్టీలు మారారని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజల్ని కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఆనాడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథతో మంచినీరు అందించామని చెప్పారు. కనీసం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వని కాంగ్రెస్ కి ఇప్పుడు ఓటు అడిగే హక్కు లేదన్నారు. మునుగోడుని దత్తత తీసుకున్నామని ఈ నియోజకవర్గంలో ప్రతి పని తాను పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన పాల్వాయి స్రవంతి కూడా ఈ రోడ్ షో లో పాల్గొన్నారు.
♦