ORR, RRR మధ్య సరికొత్త హైదరాబాద్..

ప్రో బిజినెస్‌, ప్రో అర్బన్‌ అనేవి చంద్రబాబు మోడల్‌ అని.. ప్రో రూరల్‌, ప్రో అగ్రికల్చర్‌, ప్రో పూర్‌ అనేవి రాజశేఖర్‌ రెడ్డి విధానమని, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ మోడల్‌ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Advertisement
Update:2023-11-14 15:07 IST

ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు చూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు మంత్రి కేటీఆర్. మొదటి రెండు దఫాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని, విద్యుత్ కొరతను అధిగమించామని, మూడోసారి మరిన్ని మంచి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశానికి హాజరైన కేటీఆర్ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అందించిన చేయూతను వివరించారు. డిసెంబర్‌ 3 తర్వాత సింగిల్‌ విండో అమలుచేస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలుంటే సరిచేస్తామని చెప్పారు కేటీఆర్.

త్వరలో 300 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డు (RRR) రాబోతోందని, ఔటర్ రింగ్ రోడ్ (ORR) కు RRR కు మధ్య కొత్త హైదరాబాద్‌ ఆవిష్కృతం అవుతుందని చెప్పారు కేటీఆర్. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రతి రోజు ఇంటింటికి నల్లా నీళ్లు సరఫరా చేస్తామని చెప్పారు. ఆ తర్వాత 24 గంటల తాగు నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇది తమ కమిట్‌ మెంట్‌ అని తప్పకుండా చేస్తామని చెప్పారు కేటీఆర్.

తెలంగాణ ఆర్థిక చోదక శక్తి హైదరాబాద్‌ అని అన్నారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం వాటా కేవలం హైదరాబాద్ దేనని చెప్పారు. హైదరాబాద్‌ ను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు ప్రచారం చేశారని, కానీ హైదరాబాద్‌ లో రేట్లు 10 నుంచి 20 రెట్లు పెరిగాయన్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతా భూముల రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. భూముల విలువ పెరగడంతో రాష్ట్ర ప్రజల్లో ధీమా వచ్చిందని చెప్పారు కేటీఆర్.

ఈ పదేళ్లలో దేశానికే తెలంగాణ ఒక దిక్సూచిలా మారిందని అన్నారు మంత్రి కేటీఆర్. గత పాలకులు తమకేమీ అద్భుత దీపం ఇచ్చిపోలేదని, సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. అమెరికాలో కూడా సమస్యలు ఉంటాయని, ప్రాధాన్యతా క్రమంలో తమ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని అన్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చాంకదా అని కొందరు అంటున్నారని, బాగా పనిచేసినప్పుడు ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కసాయి చేతుల్లో పెడదామా అని ప్రశ్నించారు కేటీఆర్.

తెలంగాణలో నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు మాత్రమే గుర్తొస్తారని చెప్పారు. ప్రో బిజినెస్‌, ప్రో అర్బన్‌ అనేవి చంద్రబాబు మోడల్‌ అని.. ప్రో రూరల్‌, ప్రో అగ్రికల్చర్‌, ప్రో పూర్‌ అనేవి రాజశేఖర్‌ రెడ్డి విధానమని, అన్ని రంగాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ మోడల్‌ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Tags:    
Advertisement

Similar News