అమెరికాలో నిక్కీ హేలీతో మంత్రి కేటీఆర్ సమావేశం
ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలు పంచుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీతో తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. అనేక ప్రముఖ కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.
కాగా, ఈ పర్యటనలో తొలి సారిగా ఒక పొలిటీషియన్‌ను కేటీఆర్ కలిశారు. అమెరికా, ఇండియా సంబంధాల నేపథ్యంలో.. హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి హెలీకి మంత్రి కేటీఆర్ వివరించారు. వివిధ వ్యూహాత్మక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలు పంచుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇక ఈ సారి అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి బరిలోకి దిగుతున్న హెలీకి బెస్ట్ విషెస్ తెలిపినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హెలీకి మంత్రి కేటీఆర్ జ్ఞాపికను అందజేశారు. ఇరువురు కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.