10వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వారికోసమే..
హైదరాబాద్ నగరంలో తొమ్మిదేళ్లలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
GHMC పరిధిలో మొత్తం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. వీటిలో 10 వేల ఇళ్లను మూసీ నది ఒడ్డున నివశిస్తున్న పేదలకు కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు GHMC పరిధిలోని ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తిని ఆయన ఆమోదించారు.
రెండు ఉపయోగాలు..
భారీ వర్షాలు, మూసీకి వరదలు వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోతుందని తెలిసినా, తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు కొంతమంది పేదలు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే, అందులో ఇలాంటి వారికి తొలి ప్రాధాన్యమిస్తే.. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఉండవు. పైగా మూసీలో ఆక్రమణల తొలగింపుకి కూడా ఇది మరింత ఉపయోగపడుతుంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (SNDP) లో భాగంగా మూసీని ప్రక్షాళణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని కూడా వినియోగించుకోబోతోంది ప్రభుత్వం. అటు మూసీ ఆక్రమణలు తొలగిపోతాయి, ఇటు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా లభిస్తాయి. దీంతో ఎమ్మెల్యేల విజ్ఞప్తికి వెంటనే ఆమోదం తెలిపారు మంత్రి కేటీఆర్.
ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రాథమిక ప్లానింగ్ పూర్తి చేసింది. మూసీ నది ప్రవాహానికి అడ్డుగా ఉన్న అక్రమణలను తొలగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఆక్రమణలు తొలగిస్తే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఇబ్బంది పడతారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. దీనికి ఆమోదం తెలిపిన మంత్రి కేటీఆర్.. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు. మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీనితో పాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు కేటీఆర్.
హైదరాబాద్ నగరంలో తొమ్మిదేళ్లలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.