జనగామపై కేటీఆర్ ఫోకస్.. ఆగిన మీటింగ్
జనగామ అభ్యర్థిని పార్టీ ప్రకటించే వరకు ఎవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని కేటీఆర్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఇరువ వర్గాలు కాస్త శాంతించాయి.
బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించని నియోజకవర్గాల్లో జనగామ ఒకటి. అక్కడ టికెట్ పోరు జోరుగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఆ టికెట్ తనకే కావాలంటున్నారు. వీరిద్దరి మధ్య గొడవ పతాక స్థాయికి చేరుకుంది. అధిష్టానం దృష్టిలో పడేందుకు ఇద్దరూ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి నష్టం జరిగే అవకాశాలుండటంతో మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు నేతలకు ఆయన సర్దిచెప్పినట్టు తెలుస్తోంది.
పల్లా మీటింగ్ రద్దు
తన అనుచరులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో మీటింగ్ కి అరేంజ్ మెంట్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, పల్లాను వారించారు. దీంతో ఆయన తన మీటింగ్ రద్దు చేసుకున్నారు. జనగామ అభ్యర్థిని పార్టీ ప్రకటించే వరకు ఎవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని కేటీఆర్ కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఇరువ వర్గాలు కాస్త శాంతించాయి.
ఎవరు, ఎటువైపు..?
జనగామ జెడ్పీ చైర్మన్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పల్లా గ్రూపులో చేరారు. మరికొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ముత్తిరెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇద్దరు నేతలు హైదరాబాద్ తో పాటు జనగామలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ గొడవ మరింత ముదిరే అవకాశం ఉండటంతో.. మంత్రి కేటీఆర్ కలుగజేసుకున్నారు. పార్టీ లైన్ దాటొద్దని ఇరు వర్గాలను ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరోవైపు జనగామ టికెట్ వ్యవహారం ఇంకా తేలలేదు. ఇప్పటికే టికెట్ కోసం పోరాడుతున్న ఇద్దరిని కాదని, మధ్యలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెరపైకి వచ్చారు. మూడు వర్గాలు ఊగిసలాటలో జనగామ టికెట్ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.