హైదరాబాద్ ఇ-మోటర్ షో ప్రారంభించిన కేటీఆర్
ప్రస్తుతం తెలంగాణ క్లీన్ ఎనర్జీలో దేశంలోనే ముందు వరుసలో ఉందని, ఎలక్ట్రానిక్ డెవలపింగ్ హబ్ గా మారుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఇ-మోటర్ షో 2023ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీలన్నీ ఈ షోలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారాయన. స్వయంగా బైక్ లు, ఆటోలు, కార్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
ఎలక్ట్రిక్ వాహనాల హబ్ గా తెలంగాణ..
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతోందని, దాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలే భవిష్యత్తులో మనగలుగుతాయని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం తెలంగాణ క్లీన్ ఎనర్జీలో దేశంలోనే ముందు వరుసలో ఉందని, ఎలక్ట్రానిక్ డెవలపింగ్ హబ్ గా మారుతోందని చెప్పారు. సెల్ , సెల్ కంపోనెంట్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్, బస్సుల ఎలక్ట్రిక్ ఉపకరణాలు తెలంగాణలో తయారవుతున్నాయని చెప్పారు. ఇటీవలే అమర్ రాజాతో ఒప్పందం కూడా కుదిరిందన్నారు. తెలంగాణలో పరిశ్రమలకు 24గంటలు నాణ్యమైన విద్యుత్, నీరు, అంకితభావం కలికిన ఉద్యోగులు అందుబాటులో ఉంటారని, అందుకే ఇక్కడికి పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. త్వరలో జరగబోతున్న ఫార్ములా-ఇ కూడా సక్సెస్ అవుతుందని, ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని చెప్పారు.
ఇ-మోటర్ షో లో రకరకాల కంపెనీలు తమ ఉత్పత్తులను పరిచయం చేశాయి. ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలు, టూ వీలర్లు.. కొత్త కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. తక్కువ సమయం చార్జింగ్ పెడితే, ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల విషయంలో నిరంతరం పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు నిర్వాహకులు. వికలాంగులకు ఉపయోగపడే ట్రై సైకిల్స్ లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. మామూలు సమయాల్లో చక్రాల కుర్చీగా ఉంటూ, చిన్న పరికరం దానికి తగిలించగానే ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ గా మారే వాహనాలు కూడా ఈ షో లో అందర్నీ ఆకట్టుకున్నాయి.
అసలు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇన్ని వేరియేషన్లు, ఇన్ని కొత్త మోడల్స్ వచ్చాయా అంటూ అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఈ షో జరుగుతోంది. దాదాపుగా అన్నీ ప్రముఖ బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఈ షో ద్వారా పరిచయం చేస్తున్నాయి.