శంషాబాద్ ఎయిర్ పోర్టులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఆహారం, వ్యాక్సిన్లను భద్రపరచడానికి ఈ కోల్డ్ చైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ మరో సరికొత్త వ్యవస్థకు అంకురార్పణ చేసింది. సస్టెయినబుల్ కూలింగ్ అండ్ కోల్డ్ చైన్‌కు సంబంధించి తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో నెలకొల్పింది. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
ఆహారం, వ్యాక్సిన్లను భద్రపరచడానికి ఈ కోల్డ్ చైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో ఇలాంటి కూలింగ్ సెంటర్ నెలకొల్పడం ఇదే తొలిసారి. ఇలాంటి కూలింగ్ సొల్యూషన్స్ దేశంలో మరిన్ని రావాల్సిన అవసరం చాలా ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నాము. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో మూడింట రెండొంతులు హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని మంత్రి చెప్పారు.
రాబోయే రోజుల్లో ఈ కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. సస్టెయినబుల్ కూలింగ్ ఇన్నోవేషన్‌ను ప్రమోట్ చేస్తామని అన్నారు. ఆహారం, వ్యాక్సిన్లకు సంబంధించిన సప్లయ్ చైన్స్ ఇండియాలో మరింతగా అభివృద్ధి చెందాలి. ఇలాంటి సెంటర్ల వల్ల ఆహారం, ఆరోగ్యానికి భద్రత ఉంటుందని అన్నారు. అంతే కాకుండా రైతులు, ఇతర ఎగుమతిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నెలకొల్పిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను తెలంగాణ ప్రభుత్వం, బర్మింగ్‌హామ్‌కు చెందిన సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కూలింగ్, యూఎన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రాం, జీఎంఆర్ గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.