తెలంగాణలో గోల్డ్‌మన్ భారీ విస్తరణ, న్యూయార్క్ లో కేటీఆర్ చర్చలు
అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. న్యూయార్క్ లోని గోల్డ్ మన్ శాక్స్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్, సీఈవో తో సమావేశమయ్యారు. అక్కడినుంచి తెలంగాణకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజం గోల్డ్ మన్ శాక్స్ తెలంగాణలో ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే ఇప్పుడు వాటిని భారీ స్థాయిలో విస్తరించేందుకు నిర్ణయించింది. దాదాపుగా తమ కార్యకలాపాలు రెట్టింపు చేస్తామని ఆ సంస్థ తెలిపింది. ఈమేరకు మంత్రి కేటీఆర్ తో న్యూయార్క్ లో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. న్యూయార్క్ లోని గోల్డ్ మన్ శాక్స్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్, సీఈవో తో సమావేశమయ్యారు. అక్కడినుంచి తెలంగాణకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
విస్తరణతో ప్రయోజనమేంటి..?
గోల్డ్ మన్ శాక్స్ సంస్థ విస్తరణ ఫలితంగా బ్యాంగింగ్, ఫైనాన్స్ రంగాల్లో తెలంగాణ వ్యాపారవేత్తలకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. అదే సమయంలో ఉద్యోగాలకల్పన కూడా సాధ్యమవుతుంది. గోల్డ్ మన్ శాక్స్ తమ కార్యకలాపాలను రెండు రెట్లు పెంచుతామని తెలిపింది. అంటే దాదాపు 2వేలమంది నిపుణులు ఆ సంస్థకు అదనంగా అవసరం అవుతారు. ఇందుకోసం సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యాలయాన్ని విస్తరిస్తామని తెలిపింది గోల్డ్ మన్ శాక్స్. బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్‌మన్ శాక్స్ కార్యకలాపాలకోసం నూతనంగా ఏర్పాటు చేసే కేంద్రం పనిచేస్తుంది.
ఏఐ పై దృష్టి..
2021లో గోల్డ్ మన్ శాక్స్ హైదరాబాద్ లో మొదటిసారిగా తమ కార్యకలాపాలు మొదలు పెట్టింది. రెండేళ్లలోనే భారీగా విస్తరించేందుకు నిర్ణయించడం విశేషం. కొత్తగా ఏర్పాటు చేసే ఆఫీస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు అనుకూల వాతావరణం ఉందని, తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని బట్టి తమ విస్తరణ ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తమ కార్యాలయం తమ ఇన్నోవేషన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.