అది చంద్రబాబు కాంగ్రెస్.. ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్

రేవంత్‌ వ్యాఖ్యలపై.. ఆ పార్టీ సీనియర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వాఖ్యలను వెనక్కి తీసుకుని రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update:2023-07-16 20:30 IST

తెలంగాణలో ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అని, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గాంధీ భవన్ లో ఉన్న గాడ్సే రేవంత్ అంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొనడంలో కూడా ఆయన సిద్దహస్తుడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ రమణ తండ్రి సంస్మరణ సభకు హాజరైన మంత్రి, అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉచిత కరెంటు విషంలో కాంగ్రెస్ విధానాన్ని మరోసారి ఎండగట్టారు.


5 దశాబ్దాల పాటు రైతులకు సాగునీరు, ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు నిర్మించకుండా తెలంగాణను కాంగ్రెస్‌ అధోగతి పట్టించిందని విమర్శించారు మంత్రి కేటీఆర్. కరెంట్ సరఫరా విషయంలో రేవంత్‌ చేస్తున్న వ్యాఖ్యలపై.. ఆ పార్టీ సీనియర్లు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వాఖ్యలను వెనక్కి తీసుకుని రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న వసతులను చూసి మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రైతులు సీఎం కేసీఆర్‌ కు మద్దతు తెలపడం కాంగ్రెస్ కి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా విషయంలో 2004 నుంచి 2014 వరకు ఎలాంటి పరిస్థితులున్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రైతులనే అడుగుతామన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం నిర్లక్ష్యం చేయడాన్ని రేవంత్ రెడ్డి ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేత అని, అందుకే మోదీని ఒక్క మాట అనడం లేదని ఆరోపించారు.

రాహుల్ గాంధీకి ఎడ్లు, వడ్లు తెలియవని, ఆయనకు తెలిసిందల్లా క్లబ్బులు, పబ్బులేనన్నారు. రూ.80వేలకోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం ఎలా సాధ్యమని నిలదీశారు. రేపటి నుంచి రైతు వేదికల్లో ‘కాంగ్రెస్ పార్టీ కటిక చీటక్ల పాలన వద్దు’ అని తీర్మానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలు 10రోజులపాటు కొనసాగుతాయన్నారు. ఇటీవల కేశవనగర్ స్కూల్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో తన తనయుడు హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పు ఏముందని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతి పాఠశాలని కేసీఆర్‌ ప్రభుత్వమే బాగు చేస్తోందని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News