యూఐబీసీ, హాట్‌ప్యాక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ కీలక భేటీ

ఇండియా ఒక వైవిద్యమైన దేశమని, ఇక్కడ అనేక అనుకూలతలు ఉన్నాయిని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisement
Update:2023-09-06 18:23 IST

దుబాయ్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి అక్కడ కీలక భేటీల్లో పాల్గొంటున్నారు. బుధవారం యూఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఐబీసీ) సీనియర్ ప్రతినిధుల బృందంతో కేటీఆర్ సమావేశం అయ్యారు. కేఈఎఫ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఫైజల్ కొట్టికోలన్ నేతృత్వంలోని యూఐబీసీ ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. ఇండియా, యూఏఈ మధ్య వాణిజ్యం బలోపేతానికి, అనుసంధానానికి యూఏబీసీ ఒక ఉత్ప్రేరక పాత్ర పోషించాలని కేటీఆర్ కోరారు. ఇందుకు సంబంధించిన వ్యూహాత్మక చర్చలు ఆ బృందంతో జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇండియా ఒక వైవిద్యమైన దేశమని, ఇక్కడ అనేక అనుకూలతలు ఉన్నాయిని చెప్పారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్రాల వారిగా సంప్రదింపులు జరపడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని.. యూఐబీసీ ప్రతినిధులు నగరానికి వచ్చి.. ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలంచవచ్చని వారిని ఆహ్వానించారు. తెలంగాణలో పర్యటించడం ద్వారా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పారు.

యూఏఈ, ఇండియా ప్రభుత్వాలు కలిసి యూఐబీసీ ఇండియా అనే బిజినెస్ ఛాంబర్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ పని చేస్తుంటుంది. ఈ సమావేశంలో ఈఎఫ్ఎస్ ఫెసిలిటీస్ సీఈవో టారిఖ్ చౌహాన్, బ్యూమెర్క్ చైర్మన్ సిద్దార్థ్ బాలచంద్రన్, ఎమ్మార్ సీఈవో అమిత్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

హాట్‌ప్యాక్ ప్రతినిధులతో భేటీ..

పేపర్, అల్యూమినియం, ఫోమ్, ప్లాస్టిక్‌ను ఉపయోగించి అత్యంత పరిశుభ్రమైన డిస్పోజబుల్, ప్యాకేజింగ్ ఉత్పత్తులను తయారు చేసే ప్రముఖ కంపెనీ అయిన హాట్‌ప్యాక్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ రంగంలో ప్రపంచంలోనే హాట్‌ప్యాక్ అతిపెద్ద తయారీదారుగా ఉన్నది. ఈ సంస్థ త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణను తమ కేంద్రంగా చేసుకోవాలని మంత్రి కేటీఆర్ కంపెనీ ప్రతినిధులను కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో అనుసరిస్తున్న పాలసీలను వారికి వివరించారు. అనేక విదేశీ పెట్టుబడిదారులు తెలంగాణను తమ గమ్యస్థానంగా మార్చుకున్నారని వారికి తెలిపారు. తెలంగాణలో హాట్‌ప్యాక్ కంపెనీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే తగినంత మద్దతు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాట్ ప్యాక్ ఎండీ అబ్దుల్ జబ్బార్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags:    
Advertisement

Similar News