బోర్డులు గుజరాత్ కు.. "బోడిగుండు"లు తెలంగాణకా..?
మోడీ గుండెల్లో గుజరాత్.. తెలంగాణ గుండెల్లో గునపాలా...?? ఎన్నాళ్లీ దగా..? ఇంకెన్నాళ్లీ మోసం...?" అంటూ ట్విట్టర్లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయంలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపించింది. అన్ని అర్హతలు ఉన్నా కూడా తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి నిరాకరించింది. ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా నిరాకరించడం, నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేయడం.. ఒకటా రెండా తెలంగాణపై కేంద్రం కక్షకట్టిందని చెప్పడానికి చాలా రుజువులున్నాయి. అదే సమయంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలపై మోదీకి వల్లమాలిన అభిమానం. దానికి తాజా ఉదాహరణే కొబ్బరి అభివృద్ధి బోర్డ్ సెంటర్ ని గుజరాత్ లో ఏర్పాటు చేయడం. ఆమధ్య కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభమైంది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
"Another BOARD to Gujarat
Yet Another FRAUD to Telangana
బోర్డులు గుజరాత్ కు..
"బోడిగుండు"లు తెలంగాణకా...?
మోడీ గుండెల్లో గుజరాత్...
తెలంగాణ గుండెల్లో గునపాలా...??
ఎన్నాళ్లీ దగా..? ఇంకెన్నాళ్లీ మోసం...?" అంటూ ఆయన తన ఆగ్రహం వెలిబుచ్చారు.
తెలంగాణకు బోర్డులు ఇవ్వాలని అడిగితే మొండిచేయి చూపిస్తారు, అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై మాత్రం ఎక్కడలేని ఉదారత్వం చూపిస్తారు. ఆయా బోర్డులు, పరిశ్రమల ఏర్పాట్లకు తెలంగాణకు అన్ని అర్హతలున్నా మాత్రం పక్కనపెట్టేస్తారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే మోదీ ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నుతున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్.
సొంత రాష్ట్రం గురజాత్ పై ప్రేమ కురిపించొద్దని ఎవరూ చెప్పరు, అదే సమయంలో మిగతా రాష్ట్రాలను అణగదొక్కాలనుకోవడం మాత్రం సమాఖ్య స్ఫూర్తిని కించపరచడమే. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ అదే చేస్తోంది. ఇప్పటికే ఈడీ, ఐటీ, సీబీఐని తమ స్వప్రయోజనాలకోసం, రాజకీయ కక్ష సాధింపులకోసం వాడుకుంటున్న కేంద్రం.. ప్రభుత్వరంగ సంస్థలను, అభివృద్ధి ప్రాజెక్ట్ లను కూడా రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడం దారుణం. ఇకపై ఈ మోసం, దగా చెల్లబోవని అంటున్నారు మంత్రి కేటీఆర్. బీజేపీని గద్దె దించే సమయం ఆసన్నమవుతోందని పరోక్షంగా ఆయన హెచ్చరించారు.