కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం.. కేటీఆర్ ఆవేదన

ఆడుకోవడం కోసం అక్కడి నుంచి బయటకు వచ్చిన బాలుడిపై కుక్కల గుంపు దాడికి పాల్పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలుడు ప్రయత్నించినప్పటికీ అవి వదల్లేదు. వెంటాడి మరీ కరిచాయి.

Advertisement
Update:2023-02-21 15:26 IST

హైదరాబాద్ లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని, నగరంలో కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంబర్ పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు ఆదివారం సెలవు దినం కావడంతో తన తండ్రి పనిచేసే వాటర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆడుకోవడం కోసం అక్కడి నుంచి బయటకు వచ్చిన బాలుడిపై కుక్కల గుంపు దాడికి పాల్పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలుడు ప్రయత్నించినప్పటికీ అవి వదల్లేదు. వెంటాడి మరీ కరిచాయి.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తండ్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే కుక్కలు చిన్నారిపై దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదు కాగా.. ఆ వీడియోలు తాజాగా బయటికి వచ్చాయి. ఆ వీడియోలు చూసిన వారంతా భయంతో వణికి పోతున్నారు. తమ పిల్లలను బయటకు పంపేందుకు కూడా జంకుతున్నారు.

కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు చిన్నారి ప్రయత్నిస్తుంటే కుక్కలు మాత్రం ఆ చిన్నారిని నోటకరుచుకుని చెరో వైపు లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ వీడియోలు చూస్తుంటే ఒళ్లు కూడా జలదరిస్తోంది. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన మంత్రి కేటీఆర్ స్పందించారు. 'వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం చాలా బాధాకరం. నగరంలో కుక్కల నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం' అని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News