సిరిసిల్ల సభలో కేటీఆర్ ఎమోషనల్ స్పీచ్
సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి తాను గర్వపడతానన్నారు కేటీఆర్. తనను ఆదరించిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించారు మంత్రి కేటీఆర్. రోడ్ షో లో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తనకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది సిరిసిల్ల ప్రజలేనని చెప్పారు. ఇక్కడి ప్రజలు గెలిపించకపోతే తనకంటూ గుర్తింపు ఉండేది కాదన్నారాయన. తనను ఆదరించిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనన్నారు కేటీఆర్.
సిరిసిల్ల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి తాను గర్వపడతానన్నారు కేటీఆర్. అభివృద్ధిలో సిరిసిల్లను పరుగులు పెట్టించామని.. సిరిసిల్లకు చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలని కాంగ్రెస్ అంటోందని, ఆరునెలలకో వ్యక్తి సీఎం అయ్యే మార్పు కావాలా.. రైతు బంధు ఆగిపోయే మార్పు కావాలా, లేక 3 గంటల కరెంట్ వచ్చే మార్పు కావాలా.. అని ప్రశ్నించారు. సిరిసిల్ల ఉరిసిల్ల అయ్యే మార్పు కావాలా అని ప్రశ్నించారు కేటీఆర్.
కేసీఆర్ వచ్చాక కరెంట్, నీటి కష్టాలు తీర్చుకున్నామని అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించామని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగాలని, ఆటంకం లేకుండా అభివృద్ధి జరగాలంటే మూడోసారి కేసీఆర్ సీఎం కావాలన్నారు. సిరిసిల్లలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టో హామీలు అమలులో పెడతామని, మేనిఫెస్టోలో లేని అనేక పథకాలు కేసీఆర్ మదిలో ఉన్నాయని చెప్పారు కేటీఆర్.