టెక్నాలజీ, బయాలజీ.. కలిస్తేనే పురోగతి.. దావోస్ లో కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో కలసి సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR) ఏర్పాటు చేస్తోందని, ఇది హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ విభాగాలపై దృష్టి పెడుతుందన్నారు కేటీఆర్.

Advertisement
Update:2023-01-19 19:40 IST

దావోస్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు, వేల కోట్ల పెట్టుబడులు, ఒప్పందాలు.. ఇవే కాదు... దావోస్ లో అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆలోచనలు ఉద్భవిస్తాయి. బయో టెక్నాలజీ విప్లవం అనే అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్నిచ్చారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు..? దానికి దావోస్ ప్రతినిధుల స్పందన ఏంటి..?

బయాలజీ, టెక్నాలజీ కలిస్తేనే సమస్యలను సమర్థంగా పరిష్కరించుకోగలుగుతామని అన్నారు మంత్రి కేటీఆర్. బయోటెక్ విప్లవంపై జరిగిన ప్యానల్ డిస్కషన్లో ఆయన పాల్గొన్నారు. సైన్స్ ని సరికొత్త టెక్నాలజీతో జత చేయడం వల్ల నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని, సరికొత్త ఔషధాలు మార్కెట్ లోకి వస్తాయని, ప్రజల జీవణ ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు కేటీఆర్. బయోటెక్నాలజీలో మనం పురోగతి సాధించామని అనుకున్నా కూడా.. వాతావరణ మార్పులపై పూర్తి స్థాయిలో అవగాహన రాలేదని చెప్పారు. మానవాళికి ముప్పుగా మారిన వాతావరణ పెను మార్పులను అవగాహన చేసుకుని, ముందుగానే జాగ్రత్త పడేందుకు బయోటెక్నాలజీ ఉపయోగపడాలన్నారు. బయాలజీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, డేటా సైన్సెస్.. విభాగాల కలయికతో మెరుగైన ప్రపంచాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కేటీఆర్.


భారత్ లో 35 ఏళ్లలోపు యువత 65శాతం మంది, 27 ఏళ్ల లోపు వయసున్న యువత 50శాతం మంది ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆ యువశక్తిని టెక్నాలజీ రంగం అందిపుచ్చుకోవాలన్నారు. భారత దేశంలోని పరిశోధన ప్రయోగశాలలు పేపర్ వర్క్, జర్నల్స్ ప్రచురణపై ఎక్కువగా దృష్టిపెట్టాయని, కానీ ప్రపంచం వాస్తవంగా కోరుకుంటోంది అది కాదని అన్నారు. యువత, టెక్నాలజీ అనే రెండు వేర్వేరు విషయాలను సినర్జీగా ఉపయోగించుకుంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, కొత్తగా సృష్టించబడతాయని చెప్పారు.

కొవిడ్ కళ్లు తెరిపించింది..

వైద్యరంగం వాస్తవంగా ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే విషయాలు కొవిడ్ సమయంలో బయటపడ్డాయని అన్నారు మంత్రి కేటీఆర్. అన్ని రంగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఎలాంటి మహమ్మారులనయినా తరిమేయొచ్చని కొవిడ్ తదనంతర పరిస్థితులు రుజువు చేశాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో కలసి సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (C4IR) ఏర్పాటు చేస్తోందని, ఇది హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ విభాగాలపై దృష్టి పెడుతుందన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News